‘అందరూ ‘టాక్సిక్’ రిలీజ్ ఇన్నిసార్లు ఎందుకు వాయిదా పడిందనే విషయం గురించి మాట్లాడుతున్నారు. కానీ సినిమా కంటెంట్ ఎంత కొత్తగా ఉందో ఆలోచించడం లేదు. ఇలాంటి సినిమాలు ఎప్పుడొచ్చినా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయి’ అని చెప్పింది కథానాయిక హ్యుమా ఖురేషి. యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో ఆమె ఓ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో హ్యుమా ఖురేషి సినిమా విశేషాలను పంచుకుంది.
ఈ చిత్రంలోని కొన్ని భాగాలను మాత్రమే తాను చూశానని, భారతీయ సినిమాలో ఈ స్థాయిలో యాక్షన్‌ను ఇప్పటివరకూ చూడలేదని ఆమె చెప్పింది. ‘ఇలాంటి సినిమాలు ఎప్పుడు రిలీజైనా సంచలనం సృష్టించడం ఖాయం. కంటెంట్‌తో పాటు మేకింగ్, యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తాయి. కథలోని పాయింట్ కూడా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది’ అని హ్యుమా ఖురేషి తెలిపింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా వివిధ భారతీయ భాషల్లో భారీ స్థాయి లో విడుదలకు సిద్ధమవుతున్నది.