తన సతీమణి ఊహకు విడాకులు ఇవ్వబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై సీనియర్ హీరో శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. కొన్ని వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను, ఊహ విడాకులు తీసుకుంటున్నామంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో వచ్చిన ఈ ఫేక్‌న్యూస్ చూసి నా భార్య ఊహ ఆందోళనకు గురైంది. కంగారుపడుతూ ఆ పోస్ట్‌లను నాకు చూపించింది. అలాంటి వార్తల్ని నమ్మొద్దని ఆమెను ఓదార్చాను.
ఈ ఫేక్‌న్యూస్ వల్ల నా బంధువుల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. వారికి వివరణ ఇచ్చుకోవడం న్యూసెన్స్‌గా అనిపిస్తున్నది. ప్రస్తుతం నేనూ, ఊహ చెన్నై వచ్చాం. ఇక్కడి నుంచి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మమ్మల్ని ఎంతగానో బాధిస్తున్నది. నా మీద ఫేక్‌న్యూస్ వ్యాప్తి చేస్తున్న వెబ్సైట్లు, యూ ట్యూబ్ ఛానళ్లపై సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నా’ అని శ్రీకాంత్ పేర్కొన్నారు.