Harsha Sai | ఈ మధ్య కాలంలో కంటెంట్ కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్లు చేసేస్తున్నారు. కథ, కథనం కాస్త ఎంగేజింగ్‌గా, ఎంటర్టైనింగ్ ఉంటే హీరో ఎవరా అని కూడా ఆలోచించట్లేదు. అలాంటివి ఈ మధ్య బోలెడు సినిమాలోచ్చాయి. అసలెలాంటి హైప్ లేకుండా రిలీజై కోట్లు కొల్లగొట్టాయి. కాగా తాజాగా టాలీవుడ్లో మరో కంటెంట్ సినిమా రాబోతుంది. అదే యూట్యూబ్ సెస్సేషన్ హర్ష సాయి చేస్తున్న మెగా మూవీ. తాజాగా ఈ సినిమా టైటిల్ లాంచ్‌ను హర్ష సాయి గ్రాండ్‌గా నిర్వహించాడు. ఇదే ఈవెంట్లో మూడు నిమిషాల పాటు ఉన్న ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
గ్లింప్స్ చూస్తుంటే ఇదొక థ్రిల్లర్ సినిమా అని తెలుస్తుంది. ఓ పెద్ద గంటను చూపిస్తూ దాని కింద మనిషిని వేలాడ దీసి గంట కొడితే మనిషి చనిపోతాడంటూ.. ఇలాంటి శిక్షను అనుభవించడానికి రెడీగా ఉన్న హర్ష సాయిని చూపించారు. వందల మంది మధ్య హర్ష సాయిని ఆ గంటకు కట్టి వేలాడ దీశారు.. మధ్యలో ఓ వింత మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి హర్షకు చావు సవాల్ విసురుతుంటాడు. ఆ మాటలకు మైకం నుంచి బయటకు వచ్చిన హర్ష అసలు చావంటే ఏంటి? అది నీకు చావకుండానే ఎలా తెలుస్తుంది అంటూ ఓ మాస్ డైలాగ్ చెప్పారు. అంతలో వంద సింహాలు ఒకేసారి కొరికితే ఎలా ఉంటుందో మెగాలోడాన్ కొరికితే అలా ఉంటుందని మెగా ముందు ఎదైనా దిగదుడిపే అన్న రేంజ్లో హర్షకు ఎలివేషన్ ఇచ్చారు.
చూస్తుంటే ఈ సినిమా గ్రాండియర్‌గా, పెద్ద స్కేల్పైన తెరకెక్కబోతుందని తెలుస్తుంది. స్టోరీని రివీల్ చేయలేదు కానీ.. హర్ష మాత్రం సినిమాలో ఓ పేరున్న వ్యక్తని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కూడా హర్ష సాయే అవడం విశేషం. ఈ సినిమాను బిగ్‌బాస్ ఫేం మిత్రా శర్మ ఈ సినిమాను నిర్మిస్తుంది.