CBFC Censorship | భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచాలని చూస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న సమాచార సాంకేతిక (IT) రూల్స్, 2021 స్థానంలో సరికొత్త కఠిన నిబంధనలను తీసుకురావడానికి కసరత్తులు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుత విధానం ప్రకారం, ఓటీటీ కంటెంట్‌ను థియేటర్లలో విడుదలయ్యే సినిమాల మాదిరిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ముందస్తుగా పరిశీలించి ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వదు. ఇదంతా ఐటీ రూల్స్, 2021 పరిధిలోని డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ప్రకారమే నడుస్తోంది. దీనివల్ల ఆయా ప్లాట్‌ఫామ్‌లు తమ కంటెంట్‌ను వయస్సు ఆధారంగా విభజించి, కేవలం స్వీయ నియంత్రణ మాత్రమే పాటిస్తున్నాయి.
అయితే, ఇటీవల కొన్ని ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో మితిమీరిన బోల్డ్ సీన్లు, బూతులు మరియు వివాదాస్పద రాజకీయ, సామాజికాంశాలు ఎక్కువవుతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందాయి. తాజా ఉదాహరణగా, పంజాబీ నటుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన ‘సత్లుజ్’ సినిమా నిలిచింది. ఈ చిత్రం థియేట్రికల్ విడుదల కోసం సెన్సార్ బోర్డ్ వద్దకు వెళ్లినప్పుడు ఏకంగా 120కి పైగా కట్స్ చెప్పారు. అందుకు నిర్మాతలు నిరాకరించి, నేరుగా ఓటీటీ వేదికపై విడుదల చేసినప్పటికీ, వివాదం రేగడంతో కేవలం 48 గంటల్లోనే ఆ సినిమాను తొలగించాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనల నేపథ్యంలోనే, థియేటర్ల కోసం కాకుండా నేరుగా డిజిటల్ వేదికలపై వచ్చే కంటెంట్‌కు కూడా ముందస్తు పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది.
ఇందులో భాగంగానే ఓటీటీలో నేరుగా విడుదలయ్యే చిత్రాలకు కూడా CBFC సర్టిఫికేషన్ తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. కేవలం సినిమాలకే కాకుండా, ఓటీటీ వెబ్ సిరీస్‌లను కూడా ఈ సెన్సార్ పరిధిలోకి తీసుకురావాలా లేదా అనే అంశంపై వివిధ వర్గాలతో మరియు ఐటీ శాఖతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కీలక చర్చలు జరుపుతోంది. ఒకవేళ ఈ నిబంధనలు కనుక అమల్లోకి వస్తే, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల సృజనాత్మక స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.