రివ్యూ: గని
తారాగణం: వరుణ్‌తేజ్, సయీ మంజ్రేకర్, నవీన్‌చంద్ర, ఉపేంద్ర, సునీల్‌శెట్టి, జగపతిబాబు, నదియా తదితరులు
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్
సంగీతం: తమన్
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాతలు: అల్లు బాబీ, సిద్ధు ముద్ద
సంభాషణలు: అబ్బూరి రవి
దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి
కెరీర్ ఆరంభం నుంచి కథల్లో కొత్తదనానికి పెద్దపీట వేస్తుంటారు యువహీరో వరుణ్‌తేజ్. వాణిజ్య పంథాలో ప్రయాణం సాగిస్తూనే పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించాలని తపిస్తారు. ఆయన తొలిసారి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నటించిన ‘గని’ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. బాక్సింగ్ ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ రెండేళ్ల పాటు ఎంతగానో శ్రమించారు. అమెరికా వెళ్లి బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా ద్వారా అల్లు అరవింద్ కుటుంబానికి చెందిన అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలుగా అరంగేట్రం చేశారు. కరోనా లాక్డౌన్ వల్ల ఈ సినిమా రెండేళ్ల పాటు అనేక ఒడిదుడుకులను గురైంది. ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ పెట్టిన ఎఫర్ట్స్‌కు తగిన ఫలితం దక్కిందా? నిర్మాతలు పెట్టుకున్న అంచనాలు ఎంత మేరకు నిజమయ్యాయో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే…
కథేమిటంటే:
వైజాగ్‌కు చెందిన గనికి (వరుణ్‌తేజ్) జాతీయ స్థాయి బాక్సింగ్‌లో ఛాంపియన్‌గా నిలవాలన్నది లక్ష్యంగా ఉంటుంది. అయితే గని చిన్నతనంలోనే బాక్సర్ అయిన అతని తండ్రి విక్రమాదిత్య (ఉపేంద్ర) నేషనల్ ఛాంపియన్‌గా నిలిచే క్రమంలో ప్రత్యర్థుల కుట్రలకు బలి అవుతాడు. దీంతో ఆయన భార్య మాధురి (నదియా) తన కుమారుడు గని బాక్సింగ్‌కు దూరంగా ఉండేలా ప్రమాణం తీసుకుంటుంది. అటు తల్లికి ఇచ్చిన మాటను కాదనలేక..తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో గని ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు? క్రీడల మాటున జరుగుతున్న కుట్రల్ని ఎలా ఛేదించాడు? చివరకు అతని సంకల్పం నెరవేరిందా? అన్నదే చిత్ర కథ..
ఎలా ఉందంటే:
క్రీడా నేపథ్య చిత్రాలంటేనే ఓ గమ్యాన్ని నిర్దేశించుకోవడం..దానిని చేరుకునే క్రమంలో ఎదురయ్యే సంఘర్షణే ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో వచ్చిన బాక్సింగ్ నేపథ్య చిత్రాల వలే ‘గని’ కూడా ఇదే ఫార్ములాతో తెరకెక్కింది. తండ్రి వదిలివెళ్లిన ఆశయాన్ని సాధించే కొడుకు కథ ఇది. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామాలో ఎమోషన్స్ పండించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ‘గని’లో తల్లిదండ్రుల సెంటిమెంట్ ప్రధానంగా కథను నడిపించారు. గని చిన్ననాటి ఎపిసోడ్‌తో కథను ఆరంభించారు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం గని ఆమెకు తెలియకుండా బాక్సింగ్ నేర్చుకోవడం, వీధి పోరాటాల్లో పై చేయి సాధిస్తూ తన సత్తా చాటే సన్నివేశాలు ఆకట్టుకునేలా అనిపిస్తాయి. అయితే ప్రథమార్థంలో నాయకానాయికల మధ్య పెట్టిన లవ్‌ట్రాక్‌లో ఎలాంటి ఉద్వేగాలు పండలేదు. భావోద్వేగాలతో సాగాల్సిన కథలో లవ్ఎపిసోడ్ను ఇరికించారనే భావన కలుగుతుంది. ఆ ట్రాక్ తాలూకు సన్నివేశాలన్నీ చాలా కృత్రిమంగా అనిపిస్తాయి.
ద్వితీయార్థంలోనే అసలు కథ మొదలవుతుంది. ఉపేంద్ర ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో ప్రేక్షకులు కథలోకి ఇన్వాల్వ్ కావడం మొదలుపెడతారు. విజయేంద్ర సాహు (సునీల్‌శెట్టి) దృష్టికోణం నుంచి ఫ్లాష్‌బ్యాక్ ఎపిపోడ్‌ను రివీల్ చేయడం ఆసక్తిగా అనిపిస్తుంది. కోచ్ ఈశ్వర్ (జగపతిబాబు) కుట్రలకు తన తండ్రి విక్రమాదిత్య ఎలా బలి అయ్యాడో గని తెలుసుకోడం…తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోడానికి సిద్ధమవడంతో కథాగమనం ఊపందుకుంటుంది. ఈశ్వర్ ఆరంభించిన ఐబీఎల్ (ఇండియన్ బాక్సింగ్ లీగ్) చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు క్రీడా ప్రపంచంలోకి చీకటి కోణాల్ని తెలియజెపుతాయి. తొలిభాగంతో పోల్చితే ద్వితీయార్థయంలోనే చక్కటి ఎమోషన్స్ పండాయి.
స్పోర్ట్స్ నేపథ్య చిత్రాల్లో ఎమోషనల్ ఎలిమెంట్స్‌ను సరిగ్గా బ్యాలెన్స్ చేయాలి. లక్ష్యసాధనకు కథానాయకుడు చేసే ప్రయత్నాలు ప్రేక్షకుల్ని కదిలించాలి. కానీ ఎందుకో ఈ కథలో అలాంటి భావోద్వేగాలు మిస్సయ్యాయనిపించింది. కథ గమనం ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ముందే తెలిసిపోవడంతో ఎక్కడా ఉత్కంఠగా అనిపించదు. ప్రథమార్థంపై బాగా వర్క్ చేస్తే ‘గని’ మరింతగా ఆకట్టుకునే కథగా మిగిలేది. అయితే ఉపేంద్ర ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, ైక్లెమాక్స్ ఘట్టాలు మాత్రం ఎమోషనల్‌గా సాగాయి. ప్రీ ైక్లెమాక్స్‌లో వచ్చే తమన్నా ఐటెంసాంగ్ అసందర్భంగా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే:
వరుణ్‌తేజ్ ఈ సినిమా కోసం బాగా శ్రమించారు. బాక్సర్‌గా చక్కటి శరీరాకృతిని తీర్చిదిద్దుకున్నారు. తన పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి మంచి నటనను కనబరిచాడు. ైక్లెమాక్స్ ఘట్టాల్లో వరుణ్‌తేజ్ నటన బాగా మెప్పిస్తుంది. ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఉపేంద్ర తనదైన నటనతో కట్టిపడేశారు. నదియా, సునీల్‌శెట్టి, జగపతిబాబు తమ పాత్రలకు పరిపూర్ణంగా న్యాయం చేశారు. జగపతిబాబు మరోమారు తనదైన విలనీతో మెప్పించారు. కథానాయిక సయిమంజ్రేకర్కు కథలో ఏమాత్రం స్కోప్‌లేకుండా పోయింది. ఇక సాంకేతికంగా అన్ని విభాగాల్లో సినిమాను అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. ఛాయాగ్రహణం చాలా బాగుంది. సంగీతపరంగా తమన్ కాస్త నిరుత్సాహపరిచారు. అంతగా గుర్తుంచుకునే పాటలు లేవు. అబ్బూరి రవి సంభాషణలు ఫర్వాలేదనిపించాయి. తొలి సినిమా అయినా దర్శకుడు కిరణ్ కొర్రపాటి మంచి ఎఫర్ట్స్ పెట్టారు. కొన్ని ఎపిసోడ్స్‌లో దర్శకుడిగా ఆయన పనితనం కనిపించింది. కథా రచనపై మరికొంత దృష్టిపెడితే బాగుండేదనిపించింది. నిర్మాణ విలువలు అగ్రస్థాయిలో ఉన్నాయి.
తీర్పు:
రొటీన్ స్పోర్ట్స్ డ్రామా ఇది. వరుణ్‌తేజ్ నటన ఆకట్టుకునేలా ఉంది. వచ్చేవారం వరకు పెద్దగా పోటీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రేటింగ్: 2.75/5