Cinema review | దర్శకత్వంతో పాటు నటనపై కూడా దృష్టి పెట్టారు తరుణ్ భాస్కర్. ప్రత్యేక పాత్రలతో పాటు కథానాయకుడిగా కూడా ఆయన నుంచి వరుసగా సినిమాలు వస్తున్నాయి. తాజాగా తరుణ్ హీరోగా ‘గాయపడ్డ సింహం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు ప్రత్యేక పాత్రల్లో నటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై రివెంజ్ అంటూ చేసిన ప్రచారం ఆసక్తిని పెంచింది. మరి ఆ రివెంజ్ ఎలా సాగింది? ‘గాయపడ్డ సింహం’ పంచిన వినోదాలు ప్రేక్షకులను అలరించాయా? రివ్యూలో చూద్దాం.
కథ గురించి:
దరహాస్ (తరుణ్ భాస్కర్) గాయత్రి (మానసా చౌదరి)ను ప్రేమిస్తాడు. ఆమె తండ్రి పెట్టిన కండీషన్ మేరకు అమెరికా వెళ్లిన దరహాస్, ట్రంప్ ఇమిగ్రేషన్ రూల్స్ కారణంగా తిరిగి ఇండియాకి రావాల్సి వస్తుంది. దీంతో ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ నిర్ణయం వల్ల బ్రూటల్ ధర్మ (జేడీ చక్రవర్తి), భైరవ దాస్ (శ్రీవిష్ణు), విశ్వాస్ (కశ్యప్ శ్రీనివాస్) పాత్రలపై ఎలాంటి ప్రభావం పడింది? చివరికి ట్రంప్‌పై ప్రతీకారం సాధించాడా లేదా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
డొనాల్డ్ ట్రంప్‌పై ఓ హైదరాబాదీ కుర్రాడి రివెంజ్… ఈ ఐడియా విన్నప్పుడే ఫన్నీగా అనిపిస్తుంది. నిజానికి ఆ రివెంజ్ కోసం బ్లాక్ మ్యాజిక్‌ను ఎంచుకున్న విధానంలో కూడా కావాల్సినంత వినోదం ఉంది. అయితే ఐడియాలో ఉన్నంత ఫన్ను స్క్రీన్‌పైకి తీసుకురావడంలో కొంత ఇబ్బంది ఎదురైంది. దరహాస్ లవ్ స్టోరీతో కథ మొదలవుతుంది. డల్లాస్ వెళ్లాలని కలలు కనే హీరో, చివరికి డిపోర్ట్ అయ్యి ఇండియాకి రావడం ఈ కథలో మలుపు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బ్లాక్ మ్యాజిక్ ద్వారా రివెంజ్ తీసుకోవాలని హీరో ప్రయత్నించడం చుట్టూ ఫస్ట్ హాఫ్‌లో కొంత వినోదం ఉంది.
కాకపోతే ఈ సినిమా కోసం స్పూఫ్ కామెడీని ఎక్కువగా నమ్ముకున్నారు. ‘జల్సా’ నుంచి‘అర్జున్ రెడ్డి’, ‘కేజీఎఫ్’ వరకు చాలా స్పూఫ్‌లు కనిపిస్తాయి. కానీ అందులో వినోదం ప్రేక్షకుడు ఆస్వాదించేలా ఉండదు. అలాగే కథలో డ్రామా కూడా కావాల్సినంతగా పండలేదు. సెకండ్ హాఫ్‌లో వచ్చే వినోదంపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది.
నటన గురించి:
దరహాస్ పాత్రలో తరుణ్ భాస్కర్ కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఆ పాత్రలో తన నేచురల్ టైమింగ్‌తో కనిపించారు. జేడీ చక్రవర్తి చేసిన బ్రూటల్ ధర్మ పాత్రకు రెండు షేడ్స్ ఉన్నాయి. సీరియస్‌గా కనిపించే తీరులో నవ్వు వస్తుంది కానీ తన కామెడీ షేడ్ మాత్రం వర్కౌట్ కాలేదు. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి పాత్రలు పరిమితంగానే ఉంటాయి. శ్రీవిష్ణు క్యామియో బాగానే కుదిరింది. తన సీన్స్ పర్వాలేదనిపిస్తాయి. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ కూడా ఓ పాత్రలో కనిపించారు. విష్ణు ఓయ్, శుభలేఖ సుధాకర్ తమ పరిధిలో నటించారు.
టెక్నికల్:
స్వీకార్ అగస్తి పాటలు, నేపథ్య సంగీతం డీసెంట్‌గా ఉన్నాయి. విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. విప్లవ్ ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. దర్శకుడు రాసుకున్న కొన్ని డైలాగులు అలరించాయి.
ప్లస్ పాయింట్స్: తరుణ్ భాస్కర్, ఫస్ట్ హాఫ్, కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్‌లో ల్యాగ్, వర్కౌట్ కాని స్పూఫ్ కామెడీ,
రేటింగ్: 2.75/5