Faria Abdullah | ‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఫరియా అబ్ధుల్లా , చిట్టి పాత్రతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన సహజ నటన, భావ వ్యక్తీకరణతో యువతలో ప్రత్యేక స్థానం సంపాదించిన ఆమె, ఇప్పుడు ‘గాయపడ్డ సింహం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫరియా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించగా, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా కనిపించనున్నారు. తాను ఇందులో శాలిని అనే వ్లాగర్ పాత్రలో కనిపిస్తానని, చిన్న పాత్ర అయినప్పటికీ కథలో ప్రాధాన్యం ఉంటుందని ఫరియా తెలిపింది. తరుణ్ భాస్కర్‌తో ఒక ప్రేమ కథాంశం కూడా ఉంటుందని, దర్శకుడు కశ్యప్ కథను చాలా భిన్నంగా రూపొందించారని చెప్పింది. ఆయన సృష్టించిన పాత్రలు, కథా ప్రపంచం చాలా వినోదాత్మకంగా ఉంటాయని వెల్లడించింది.
ఈ సినిమా పలు స్థాయిల్లో సాగే కథగా ఉంటుందని, ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని ఫరియా వివరించింది. తన పాత్రలో హాస్య అంశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత మళ్లీ చూడాలనిపించేలా ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. కథ నచ్చితే పాత్ర నిడివి గురించి పట్టించుకోకుండా నటిస్తానని ఫరియా పేర్కొంది. ఈ కథ వినగానే కొత్తగా అనిపించిందని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఆనందిస్తారని ఆమె నమ్మకం వ్యక్తం చేసింది. తరుణ్ భాస్కర్‌తో పనిచేసిన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ, ఆయన చాలా సరదాగా ఉంటారని, ఆయన హాస్య టైమింగ్ ప్రత్యేకమని చెప్పింది. చిన్న అభినయంతోనే నవ్వు తెప్పించగల సామర్థ్యం ఉందని పేర్కొంది. సినిమా తుది రూపం చాలా బాగా వచ్చిందని, ఇది విజయవంతమవుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది.
ఈ చిత్రంలో శ్రీ విష్ణు పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని, దానిని ఎంతో చక్కగా రూపొందించారని తెలిపింది. మానస చౌదరి హీరోను వదిలే పాత్రలో కనిపిస్తే, తాను అతనికి అండగా నిలిచే పాత్రలో నటించానని సరదాగా చెప్పింది. ఇక తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం కొన్ని కథలు రాస్తున్నానని, వచ్చే ఏడాది తన దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నానని ఫరియా వెల్లడించింది. ప్రస్తుతం ‘భగవంతుడు’, ‘సిగ్మా’ వంటి చిత్రాలతో పాటు సత్యదేవ్ కంచరణతో ఒక సినిమా కూడా చేస్తున్నానని తెలిపింది. ‘గాయపడ్డ సింహం’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ఫరియా అబ్దుల్లా, భవిష్యత్తులో దర్శకురాలిగా మారాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.