‘అభిమానులు థియేటర్లో సినిమా చూసే దగ్గర ఆగిపోవడం కాదు. ఇలా మమ్మల్ని, మా సినిమాల్ని చూసి పొందిన స్ఫూర్తి ద్వారా సినిమా పరిశ్రమలోకి వచ్చి ఇలా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటూ విజయాలు సాధిస్తున్నారంటే అందుకు నాకంటే సంతోషించే వారు వుండరు’ అన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన ‘బేబి’ చిత్రం కల్ట్ సెలబ్రేషన్స్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా అభిమానులైన సాయిరాజేష్, మారుతి ఎస్.కె.ఎన్ కలిసి చేసిన సినిమా ఘనవిజయం సాధించడం ఆనందంగా వుంది.
ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ ఎంతో పరిణితి చెందిన నటుడిగా కనిపించాడు. సినిమాలో అతను పలికించిన భావోద్వేగాలు చూస్తుంటే ఆనంద్‌లో గొప్ప నటుడు ఉన్నాడని అర్థమవుతుంది. బస్తీ అమ్మాయిగా, కాలేజీలో ట్రెండీ యువతిగా మేకోవర్‌లో కథనాయిక వైష్ణవి ఆకట్టుకుంది. జీవితంలో తెలిసో తెలియక తప్పు చేస్తే బాధపడకుండా కూర్చోకుండా మంచి లైఫ్ వుందనే ఆశతో బతకాలనే గొప్ప సందేశాన్ని ఈ చిత్రంలో సాయిరాజేష్ చెప్పాడు. అందుకే నేడు ప్రేక్షకులు ఈ చిత్రానికి ఇంత గొప్ప విజయాన్ని అందించారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు పలువురు అతిథులు పాల్గొన్నారు.