Vijay | తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ దళపతి ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. సినిమాల్లో సూపర్ స్టార్‌గా ఎదిగిన ఆయన, ఇప్పుడు రాజకీయాల్లోనూ సంచలన విజయంతో ముఖ్యమంత్రి పీఠం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ రాజకీయ హడావుడి మధ్య విజయ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే ఆయన లగ్జరీ కార్ల నంబర్ ప్లేట్ల వెనుక దాగి ఉన్న ఎమోషనల్ కథ. ఇటీవల విజయ్ తన పాత రోల్స్ రాయిస్ కారును విక్రయించి మూడు కొత్త విలాసవంతమైన వాహనాలను కొనుగోలు చేశారు. అందులో BMW ఎలక్ట్రిక్ కారు, Lexus LM, Toyota Vellfire ఉన్నాయి. రాజకీయ ప్రచారాల కోసం ప్రత్యేకంగా ఓ క్యాంపెయిన్ బస్సును కూడా సిద్ధం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ అన్ని వాహనాల నంబర్ ప్లేట్లలో “0277” అనే సంఖ్య ఉండటం.
బీఎండబ్ల్యూ కారు నంబర్ TN 14 AH 0277 కాగా, లెక్సస్ ఎల్ఎం కి TN 14 AL 0277, టయోటా వెల్ఫైర్ కి TN 14 AM 0277 నంబర్లు ఉన్నాయి. అలాగే టీవీకే ప్రచార బస్సుకు కూడా TN 14 AS 0277 నంబరే ఉండటం అభిమానుల్లో ఆసక్తి రేపింది. అయితే ఈ సంఖ్య వెనుక ఒక బలమైన భావోద్వేగం దాగి ఉందని తెలిసి అభిమానులు మరింత ఎమోషనల్ అవుతున్నారు. “0277” అంటే అసలు 14-02-77 తేదీని సూచిస్తుందని తెలుస్తోంది. అదే విజయ్ చిన్న చెల్లెలు విద్యా చంద్రశేఖర్ జన్మదినం. చిన్న వయసులోనే కన్నుమూసిన తన చెల్లెలి జ్ఞాపకాన్ని ఎప్పటికీ తనతో ఉంచుకోవాలని భావించిన విజయ్.. తన వాహనాలన్నింటికీ ఈ సంఖ్యను ప్రత్యేక గుర్తుగా పెట్టుకుంటున్నారని సమాచారం.
విద్యా చంద్రశేఖర్ మరణం విజయ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆయన కుటుంబ సభ్యులు పలు సందర్భాల్లో వెల్లడించారు. చిన్నతనంలో చాలా అల్లరి, చురుకుగా ఉండే విజయ్.. చెల్లెలి మరణం తర్వాత చాలా మౌనంగా మారిపోయారని ఆయన తల్లిదండ్రులు చెప్పిన విషయాలు అప్పట్లో వైరల్ అయ్యాయి.విజయ్ సినిమాల్లో కనిపించే సిస్టర్ సెంటిమెంట్ వెనుక కూడా ఇదే కారణమని అభిమానులు చెబుతుంటారు. ముఖ్యంగా తిరుపాచి సినిమాలో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చూపించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. నిజ జీవిత బాధనే తెరపై ఆవిష్కరించారని అప్పట్లో అభిమానులు ప్రశంసించారు. అంతేకాదు, తన చెల్లెలి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు విజయ్. ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ తమ నిర్మాణ సంస్థకు “విద్యా-విజయ్ ప్రొడక్షన్స్” అని పేరు పెట్టడం కూడా ప్రత్యేకంగా నిలిచింది. పేద పిల్లలకు విద్యా సహాయం అందించడం వంటి కార్యక్రమాల్లో కూడా విజయ్ ముందుంటున్నారు.
ఇప్పుడు ఆయన కార్ల నంబర్ ప్లేట్ల వెనుక ఉన్న ఈ భావోద్వేగ కథ తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. “సూపర్ స్టార్ మాత్రమే కాదు.. కుటుంబాన్ని మరిచిపోని మంచి మనసున్న వ్యక్తి” అంటూ విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.