రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా రూపొందుతున్న సినిమా ‘శశివదనే’. ఈ చిత్రాన్ని లవ్, యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన రూపొందిస్తున్నారు. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్, ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకాలపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను దర్శకుడు హరీశ్ శంకర్ విడుదల చేశారు.
శరవణ వాసుదేవన్ స్వరపర్చిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా హరి చరణ్, చిన్మయి శ్రీపాద పాడారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ…‘సినిమాకు మంచి తెలుగు టైటిల్ పెట్టారు. ఆకట్టుకునే సంగీతం, సాహిత్యం కుదిరాయి. ఈ పాటలో ‘చేతిలో చెయ్యి వేస్తే నువ్వు గీతలే మారవా..’ అనే లైన్ బాగా నచ్చింది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు.