Dhurandhar 2 | బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విడుదలైన కేవలం కొన్ని రోజుల్లోనే ఈ సినిమా అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాస్తోంది. ఇప్పటికే అత్యంత వేగంగా రూ.1200 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా సంచలన రికార్డు సృష్టించిన ఈ మూవీ, ఇప్పుడు మరో భారీ మైలురాయిని అందుకుంది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2: ది కన్‌క్లూజన్ భారతీయ సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం సాధించిన కలెక్షన్లు ఇప్పటివరకు ఎవరికీ అందని ఎత్తులో నిలిచాయి.
నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ తన పూర్తి రన్లో సుమారు 22 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలిచింది. ఈ రికార్డు గత తొమ్మిదేళ్లుగా ఎలాంటి భారీ సినిమాలు వచ్చినా చెదరలేదు. అయితే ఇప్పుడు ఆ అజేయ రికార్డును ‘ధురంధర్ 2’ చెరిపేసింది. కేవలం 9 రోజుల్లోనే ఈ చిత్రం 22.1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసి ఓవర్సీస్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక సినిమా తన పూర్తి రన్లో సాధించిన మైలురాయిని, మరొక సినిమా విడుదలైన 10 రోజులు కూడా గడవకముందే అధిగమించడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన, భారీగా పెరుగుతున్న డిమాండ్ ఈ చిత్రాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా విదేశీ మార్కెట్లలో ఈ సినిమా చూపిస్తున్న దూకుడు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘ధురంధర్ 2’ ఫుల్ రన్ ముగిసే సమయానికి ఇంకా ఎన్నో అసాధ్యమైన రికార్డులను సుసాధ్యం చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొనసాగిస్తున్న జోరు చూస్తుంటే, భారతీయ సినిమా చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి