రివ్యూ: సార్
తారాగణం: ధనుష్, సంయుక్త మీనన్, సముద్రఖని, తనికెళ్ల భరణి, హైపర్ ఆది తదితరులు
సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాతలు: నాగవంశీ, సాయిసౌజన్య
దర్శకత్వం: వెంకీ అట్లూరి
తమిళ కథానాయకుల్లో ధనుష్ శైలి చాలా ప్రత్యేకం. వాణిజ్య కథాంశాల్ని ఎంచుకుంటూనే వాటి ద్వారా సామాజిక ఉపయుక్తమైన సందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు కేవలం అనువాద చిత్రాల ద్వారానే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ధనుష్ నటించిన తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘సార్’. ఆర్థిక తారతమ్యాలు, స్థాయీ భేదాలతో సంబంధం లేకుండా విద్య ప్రతి ఒక్కరి హక్కు అనే బలమైన అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో అగ్రగామి నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ప్రచార చిత్రాలతోనే అంచనాల్ని పెంచిన ‘సార్’ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం…
కథ గురించి:
2000 సంవత్సరం నేపథ్యంలో నడిచే కథ ఇది. సరళీకృత ఆర్థిక విధానాల ప్రభావంతో భారతీయ సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్న రోజులవి. అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ ఉపందుకుంటుంది. విద్యారంగంలో కూడా ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు పుట్టుకొస్తాయి. ఇదే అదనుగా విద్య ద్వారా అక్రమార్జనకు తెరతీస్తాడు త్రిపాఠి (సముద్రఖని). త్రిపాఠి విద్యా సంస్థల ద్వారా కాలేజీ ఎడ్యుకేషన్‌పై గుత్తాధిపత్యం సంపాదించాలని ప్రయత్నిస్తుంటాడు. దీంతో అధిక ఫీజులు చెల్లించలేని తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. ప్రతిపక్షాల సహాయంతో వారు ఆందోళనలకు సిద్ధమవుతారు. ప్రభుత్వం సైతం ఫీజు నియంత్రణకు చట్టం తీసుకురావడంతో త్రిపాఠి ఆత్మరక్షణలో పడతాడు. ప్రభుత్వ కాలేజీలను తానే దత్తత తీసుకొని…అధ్యాపకుల్ని నియమించి నడిపిస్తానని దుష్ట పన్నాగానికి తెరతీస్తాడు. అలా ఆయన ద్వారా సిరిపురం ప్రభుత్వ కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా అపాయింట్ అవుతాడు బాలగంగాధర్ తిలక్ అలియాస్ బాలు (ధనుష్). పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తే బాలూకు సీనియర్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని వాగ్దానం చేస్తాడు త్రిపాఠి. ఈ నేపథ్యంలో సిరిపురం కాలేజీలో బాలు ప్రయాణం ఎలా సాగింది? విద్యా వ్యవస్థతో పాటు అక్కడి సామాజిక అంతరాలను రూపు మాపడానికి బాలు చేసిన పోరాటం ఎలాంటి ఫలితాల్ని అందించిందన్నదే మిగతా కథ..
కథా విశ్లేషణ:
నేటి సమాజంలో విద్య వ్యాపార వస్తువుగా మారిందనేది నిర్వివాదాంశం. ప్రైవేటీకరణ వల్ల విద్య సామాన్యులకు దూరమైపోయింది. లక్షలు పోసి ఎల్కేజీలో సీట్లు కొనుక్కునే పరిస్థితుల్ని చూస్తున్నాం. విద్య ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు..అది డబ్బున్న వాళ్లకు మాత్రమే దొరికే వరంలా మిగిలిపోకూడదనే చక్కటి సామాజికాంశాన్ని ఈ సినిమాలో చర్చించారు. ఓ వీడియో లైబ్రరీలో దొరికిన క్యాసెట్‌ను పట్టుకొని కొందరు యువకులు అందులో పాఠాలు బోధించిన సార్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయడం..ఈ క్రమంలో వారు కడప కలెక్టర్ మూర్తి (సుమంత్)ను కలవడం..ఆయన ఫ్లాష్‌బ్యాక్‌లో ఈ కథను చెప్పిన తీరు ఆరంభంలోనే ఆసక్తిని పంచుతుంది. అయితే ఓ బలమైన సోషల్పాయింట్ను చెప్పాలంటే విషయ ప్రామాణికతకు చాలా ప్రాధాన్యమివ్వాలి. ఈ సినిమాలో అది కొరవడింది. కథాపరంగా దర్శకుడు సృజనాత్మక స్వేచ్ఛను తీసుకున్నారని సర్ధిచెప్పుకున్నా…చాలా సన్నివేశాలు ఓవర్ డ్రామాటిక్‌గా అనిపించడం మైనస్‌గా అనిపిస్తుంది. బలమైన ఉద్వేగాలు లోపించడంతో చాలా సన్నివేశాలు తేలిపోయాయి.
సిరిపురం కాలేజీలో లెక్చరర్‌గా అడుగుపెట్టిన బాలు అక్కడి పరిస్థితుల్ని చూసి చలించిపోవడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేసే ప్రయత్నాలు ఎమోషనల్‌గా సాగుతాయి. కాలేజీలో కుల వివక్షకు తావులేదని..అందరూ సమానమేనని విద్యార్థుల్లో బాలు మార్పును తీసుకొచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఊరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్య గొప్పతనాన్ని, సమాజంలో చదువుకున్న వారికి ఎలాంటి విలువ ఉంటుందో బాలు వివరించే ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుంది. అర్థవంతమైన సంభాషణల ద్వారా ఆ సన్నివేశాల్ని తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. ప్రథమార్థంలో చక్కటి ఎమోషన్స్ పండటంతో పాటు బాలు లక్ష్యానికి ఓ ఉన్నతమైన వేదిక సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది.
ద్వితీయార్థంలోనే కథాగమనం మొత్తం పట్టుతప్పింది. సన్నివేశాల్లోని అతి నాటకీయత ఇబ్బంది పెడుతుంది. బాలుని ఊరి నుంచి వెలివేయడంతో అతను విద్యార్థులను రహస్యంగా కలుసుకోవడానికి నాటకాల్లోని పాత్రలు ధరించి రావడం సిల్లీగా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో త్రిపాఠిపై బాలు పోరాటాన్ని బలంగా ఆవిష్కరించే వీలున్నా దర్శకుడు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఇక ైక్లెమక్స్ ఘట్టాలు ఏమాత్రం ప్రేక్షకులకు రుచించవు. బాలు ఏ ఉన్నతమైన లక్ష్యం కోసం విద్యార్థులను ఉత్తమ ర్యాంకర్లుగా తీర్చిదిద్దాడో… చివరకు వారిని త్రిపాఠి వ్యాపారానికి సహాయం చేసినట్లుగా చూపించడం కథా ఔచిత్యాన్ని దెబ్బతీసినట్లుగా అనిపిస్తుంది. పతాక ఘట్టాల్ని కాస్త అర్థవంతంగా మలిస్తే బాగుండేది. మొత్తంగా చూస్తే కొన్ని దశాబ్దాలుగా సమాజంలో వేళ్లూనుకుపోయిన ఓ బర్నింగ్ ఇష్యూను దర్శకుడు ఈ సినిమాలో చర్చించడం అభినందనీయమే అయినా మరింత అర్థవంతంగా కథాంశాన్ని ప్రజెంట్ చేస్తే గొప్ప చిత్రంగా మిగిలిపోయేది. ఈ సినిమాలో హృతిక్‌రోషన్ నటించిన ‘సూపర్ 30’ ఛాయలు చాలా వరకు కనిపిస్తాయి. ఇటీవల కాలంలో విద్యావ్యవస్థపై చర్చించిన సినిమాలు రావడం లేదు. ఈ కారణంగా సినిమాలోని పాయింట్‌తో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు.
నటీనటుల పర్ఫార్మెన్స్:
ధనుష్ అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. ఈ తరహా పాత్రల్లో సహజమైన నటనతో మెప్పిస్తాడు. బాలు పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచాడు. ఇక కథానాయిక సంయుక్త మీనన్‌కు అభినయ ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. ప్రతినాయకుడిగా సముద్రఖని తనకు అలవాటైన పాత్రలో మెప్పించారు. సాయికుమార్, తనికెళ్ల భరణి తమ పరిధుల మేరకు నటించారు. హైపర్ ఆది కామెడీ అంతగా పండలేదు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలుస్తుంది. నిర్మాణ విలువల ఉన్నతంగా కనిపిస్తాయి. ఈ సినిమా ద్వారా దర్శకుడు తాను చెప్పదలచుకున్న పాయింట్లో నిజాయితీ కనిపించింది. అయితే కథ, కథనాలపై కాస్త శ్రద్ధ తీసుకుంటే ‘సార్’ సందేశం అందరినీ ఆకట్టుకునేది.
+ప్లస్ పాయింట్స్:
బలమైన సందేశం ఉన్న సామాజికాంశం
ధనుష్ యాక్టింగ్, చక్కటి నిర్మాణ విలువలు
-మైనస్ పాయింట్స్:
స్క్రీన్‌ప్లేలో ఆసక్తిలోపించడం
కొన్ని సన్నివేశాల్లో అతి నాటకీయత
కుదరని ైక్లెమాక్స్
రేటింగ్: 2.5/5.