అగ్ర కథానాయిక దీపికా పడుకోన్ ఇటీవలే ప్రెగ్నెట్ అయింది. రణ్వీర్-దీపికా దంపతులు రెండో సంతానం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే గర్భం కారణంగా దీపికా పడుకోన్ ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల నుంచి విరామం తీసుకోనుందని, ముఖ్యంగా అల్లు అర్జున్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘రాకా’ నుంచి ఆమె తప్పుకునే అవకాశాలున్నాయని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది. వీటిపై నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్ స్పందించింది. ‘షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ జరుగుతున్నది. ఈ సినిమాలో దీపికా పడుకోన్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
ఆమె ఉత్సాహంగా షూట్లో పాల్గొంటున్నారు’ అంటూ మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో సోషల్‌మీడియా వార్తలన్నీ పుకార్లని తేలిపోయింది. ‘రాకా’ సినిమా కోసం కథానుగుణంగా దీపికా పడుకోన్‌పై కొన్ని యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించాల్సి ఉందట. ఆమె గర్భవతి కావడంతో వైద్యపరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ యాక్షన్ సీన్స్‌ను త్వరితగతిన పూర్తి చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘రాకా’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.