Citadel | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు రిచర్డ్ మాడెన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన పాపులర్ సిరీస్ ‘సిటాడెల్’ నిర్మాణ వ్యయంపై అమెజాన్ ప్రైమ్ సంస్థ అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలిసింది. అమెజాన్ వీడియో ఒరిజినల్ సిరీస్లో భాగంగా ‘సిటాడెల్’ సిరీస్ను తెరకెక్కించారు. గత ఏప్రిల్లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్కు అంతగా ఆదరణ దక్కలేదు. భారత్-ఇటలీ నేపథ్య కథాంశాలతో స్పై థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సిరీస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిందని అమెజాన్ ప్రైమ్ వీడియో అభిప్రాయపడింది.
దాదాపు 250 మిలియన్ డాలర్ల్ల (రెండు వేల కోట్లు) వ్యయంతో ఈ సిరీస్ను తెరకెక్కించగా… పెట్టిన ఖర్చు ఎక్కడా కనిపించలేదని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ సీఈఓ ఆండీ జాసీ నిర్మాణ వ్యయం విషయంలో విచారణకు ఆదేశించారు. స్క్రిప్ట్ మొదలుకొని మేకింగ్ వరకు ఈ సిరీస్లో ఎన్నో లోపాలున్నాయని అమెజాన్ ప్రైమ్ సంస్థ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది.