Guntur Karam | మహేష్ బాబు ఫోకస్ మొత్తం ఇప్పుడు గుంటూరు కారం సినిమా మీదే ఉంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైపోయింది. దాంతో దుబాయ్ వెళ్లి హాయిగా యాడ్ షూటింగ్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్. అయితే గుంటూరు కారం సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు మహేష్ బాబు. ఈయన ముందు సినిమా పెద్దగా ఆడలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన సర్కారు వారి పాట ఆబోవ్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. దాంతో గుంటూరు కారం సినిమాతో కచ్చితంగా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు మహేష్.
సంక్రాంతికి ఎంతమంది పోటీలో ఉన్నా కూడా సూపర్ స్టార్ సినిమాకు జరి బిజినెస్ మాత్రం మరో స్థాయిలో ఉంటుంది. అన్నింట్లోనూ గుంటూరు కారం సినిమాకే అగ్ర తాంబూలం ఇస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. దానికి తోడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు. అతడు, ఖలేజా రెండు కల్ట్ క్లాసిక్ సినిమాలు అనిపించుకున్నాయి.. కానీ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ మాత్రం చేయలేదు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి మెగా హీరోలకు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. నితిన్ లాంటి హీరోలకు కూడా కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. దాంతో మహేష్ బాబుకు కూడా బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కలలు కంటున్నాడు మాటల మాంత్రికుడు. దాని కోసమే గుంటూరు కారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు డాన్సుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటున్నాడు. చాలా కాలంగా ఈయన సినిమాలలో డాన్సులు పెద్దగా కనిపించడం లేదు. స్టెప్పులు వేస్తున్నా కూడా ఏదో అలా అలా కానిచ్చేస్తున్నాడు కానీ.. ఒళ్ళు వంచి ఒకప్పట్లా మాత్రం ఇరగదీయడం లేదు సూపర్ స్టార్. సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట సినిమాలలో ఒకటి రెండు పాటల్లో స్టెప్పులు బాగానే వేసినా కూడా పూర్తిగా మాస్ మాత్రం కాదు. ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో ఆ బాకీ మొత్తం తీర్చేస్తున్నాడు మహేష్. తాజాగా విడుదలైన కూర్చి మడతపెట్టి అనే పాటలో మహేష్ బాబు స్టెప్పులు చూస్తుంటే వారెవా అనకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు.
ఈ విషయంలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఎక్కువ క్రెడిట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మహేష్ బాబు సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేయడం మొదలు పెట్టిన తర్వాతే డాన్సులలో వేగం పెరిగింది. ఇప్పుడు ఈ కుర్చీ మడతపెట్టి పాటలో అయితే మహేష్ స్టెప్స్ మరింత వేగంగా ఉన్నాయి. పైగా పక్కనున్నది శ్రీలీల కావడంతో ఆమెకు మ్యాచ్ అయ్యేలా మహేష్ కూడా రెచ్చిపోయాడు. ఇప్పుడు లిరికల్ సాంగ్ చూస్తుంటేనే ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది అంటే.. రేపు థియేటర్లలో పాట చూసేటప్పుడు అభిమానుల గోల ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి డాన్సుల విషయంలో మాత్రం మహేష్ బాబును బాగా ఇబ్బంది పెడుతున్నాడు శేఖర్ మాస్టర్. గతంలో లేనంతగా ఆయనతో స్టెప్పులు వేయిస్తున్నాడు.