Darshan | రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. కన్నడ సూపర్‌స్టార్ దర్శన్ తూగుదీప, హీరోయిన్ పవిత్ర గౌడ సహా మరో 15 మంది నిందితుల పేర్లను చార్జిషీట్లో చేరారు. బెంగళూరు 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు చార్జిషీట్‌ను ఫైల్ చేశారు. మొత్తం 3,991 పేజీలతో ఉన్న ఛార్జిషీట్లో ఏ1గా హీరోయిన్ పవిత్ర గౌడ, ఏ2గా హీరో దర్శన్ పేర్లను పేర్కొన్నారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ చార్జిషీట్‌ను కోర్టులో ఫైల్ చేసింది. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ నివేదికలను సైతం సిట్ చార్జిషీట్లో ప్రస్తావించింది. రేణుక స్వామి కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 50 మందికిపైగా పోలీసులు, ఎనిమిది మంది వైద్యులు, 97 మంది సాక్షుల పేర్లను సైతం ప్రస్తావించారు.
అలాగే, దర్శన్ బట్టలు, పవిత్ర గౌడ ధరించిన చెప్పులపై రక్తపు మరకలు సైతం కనిపించాయని చెప్పారు. సెక్షన్ 164 సీఆర్పీసీ కింద 27 మంది వాంగ్మూలాలను కోర్టు ఎదుట నమోదు చేసుకున్నట్లు వివరించారు. రేణుక స్వామి హత్యకు కుట్ర.. దాన్ని అమలు పరచడం, కిడ్నాప్, చిత్రహింసలు, హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, తాము హత్య చేసినట్లుగా నలుగురిని పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రేరేపించడం, కేసు దర్యాప్తు, పోలీసులను తప్పుదోవ పట్టించేలా ప్లాన్ చేయడంలో దర్శన్, పవిత్ర గౌడల పాత్ర ఉందని చార్జిషీట్లో పేర్కొన్నారు. 33 సంవత్సరాల రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ తూగుదీపను జూన్ 11న అరెస్టు చేశారు. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని హత్య చేసినట్లు తేలింది. దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై అనేక గాయాలను గుర్తించారు.