“బుట్టబొమ్మ’ చిత్రానికి అన్ని చోట్ల మంచి స్పందన లభిస్తున్నది. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. మనం పిల్లలతో చెప్పలేని కొన్ని విషయాలుంటాయి. ఈ సినిమా చూస్తే వాటిని సులభంగా అర్థం చేసుకుంటారు’ అన్నారు శౌరి చంద్రశేఖర్. ఆయన దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘బుట్టబొమ్మ’. అనిఖా సురేంద్రన్, సూర్యవశిష్ట, అర్జున్దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అర్జున్దాస్ మాట్లాడుతూ ‘చక్కటి కుటుంబ కథతో సందేశాత్మక చిత్రంగా ఆకట్టుకుంటున్నది. మంచి పాత్రను పోషించినందుకు ఆనందంగా ఉంది’ అన్నారు. ‘థియేటర్లలో ప్రేక్షకుల మధ్య సినిమా చూశాం. అద్భుతమైన స్పందన కనబరుస్తున్నారు. ఈ సినిమా మీద మా అంచనాలన్నీ నిజమయ్యాయి’ అని సూర్యవశిష్ట తెలిపారు. తెలుగులో తన తొలి చిత్రానికి ఆదరణ దక్కడం ఆనందంగా ఉందని కథానాయిక అనిఖా సురేంద్రన్ పేర్కొంది. సినిమాలోని సందేశం ఆకట్టుకుంటున్నదని రచయిత గణేష్ రావూరి తెలిపారు.