రోషన్ కనకాల కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్’. రవికాంత్ పేరేపు దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ నెల 29న విడుదల కానుంది. శుక్రవారం థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, హీరో రానా ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
‘నా నసీబ్ ఏం రాసి పెట్టుందో నాకు తెల్వదు..కానీ నచ్చినట్లు మార్చుకుంటా. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా..అది ఇజ్జత్ అయినా..ఔకాత్ అయినా’ అనే పవర్ఫుల్ డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని పంచింది. హీరో రోషన్ కనకాల డీజే పాత్రలో కనిపించాడు. ప్రేమలో విఫలమైన అతను తన ప్రతిభను ప్రపంచానికి తెలియజెప్పాలనే లక్ష్యాన్ని ట్రైలర్లో ఆవిష్కరించారు.
ఈ సినిమా ట్రైలర్లోనే సూపర్‌హిట్ కళ కనిపిస్తున్నదని కె.రాఘవేంద్రరావు ప్రశంసించారు. యువత మెచ్చే అన్ని అంశాలున్నాయని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ట్రైలర్‌ను రాఘవేంద్రరావు లాంచ్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని హీరో రోషన్ పేర్కొన్నాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘ట్రైలర్ కంటే సినిమా ఇరవైరెట్లు ఉత్సాహాన్నిస్తుంది. చక్కటి వినోదంతో అలరిస్తుంది. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన సంగీతాన్నందించాడు’ అన్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇదని, తప్పకుండా అందరికి నచ్చుతుందని నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.