Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ బాబు తాజాగా చిన్న విరామం తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్‌కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రీసెంట్గా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహేష్ బాబు తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో కలిసి కనిపించారు. ఎయిర్‌పోర్ట్‌లో కుటుంబంతో కలిసి కనిపించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ‘వారణాసి’ షూటింగ్‌కు మహేష్ బాబు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు స్పష్టమైంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, మహేష్ బాబు జూలై 1, 2026 నుంచి మళ్లీ ‘వారణాసి’ షూటింగ్లో పాల్గొననున్నారని తెలుస్తోంది. వరుసగా నెలల తరబడి షూటింగ్లో పాల్గొన్న అనంతరం కుటుంబంతో కొంత సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్రల గురించి వస్తున్న వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఆయన ‘రుద్ర’ పాత్రలో కనిపించడమే కాకుండా, శ్రీరాముడి పాత్రలో కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్లు, అడ్వెంచర్ సన్నివేశాలు సినిమా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక ఈ చిత్రంలో ‘మందాకిని’ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ నిర్మిస్తుండగా, ఎస్ఎస్ కార్తికేయ కూడా నిర్మాణ బాధ్యతల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సుమారు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తుండగా, కథను విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా సంభాషణలు రాస్తున్నారు. రాజమౌళి విజన్‌కు అనుగుణంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయి విజువల్స్, సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ సినిమాను పలు భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.