కన్నడంలో విజయం సాధించిన ‘హుడుగారు బేకగిద్దరేను’ చిత్రాన్ని తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్నారు. నితిన్ కృష్ణమూర్తి దర్శకుడు. ప్రజ్వల్ బీపీ, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. థియేట్రికల్ ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా ఆద్యంతం నవ్విస్తుంది.
అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కించాం. బాయ్స్ హాస్టల్ విద్యార్థుల జీవితాల్లో జరిగిన సంఘటనలు ఎలాంటి మలుపులకు దారితీశాయనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అన్నారు. ‘ఈ సినిమాను రీమేక్ చేయడం అసాధ్యం. అందుకే తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నాం. సాంకేతికంగా కూడా ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో ఉంటుంది’ అని అనురాగ్ రెడ్డి తెలిపారు. సుప్రియ మాట్లాడుతూ ‘ ట్రైలర్ చూడగానే తెలుగులో తీసుకురావాలని భావించాం. యూత్‌ఫుల్ మూవీగా అందరిని అలరిస్తుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.