బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు బాక్సాఫీస్ కలిసి రావడం లేదు. ఏడాదికి కనీసం నాలుగు సినిమాల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచారు అక్షయ్. ఏ ఇమేజ్‌కు కట్టుబడకుండా కామెడీ, యాక్షన్, పేట్రియాటిక్, హారర్, హిస్టారికల్..ఇలా అనేక తరహా చిత్రాల్లో వరుసగా నటిస్తూ వచ్చారు. అయితే గత రెండేళ్లుగా అక్షయ్ చేసిన సినిమాలేవీ ఆదరణ పొందడం లేదు.
‘లక్ష్మి’, ‘బెల్ బాటమ్’, ‘సూర్యవంశీ’, ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, ‘రక్షా బంధన్’, ‘కట్ పుత్లి’ ఇలా సినిమాలన్నీ ఆశించిన ఫలితాలు అందుకోలేదు. తాజాగా విడుదలైన ఆయన సినిమా ‘రామ్ సేతు’ కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంటున్నది. మంచి కథే అయినా దాన్ని ఆకట్టుకునేలా తెరపై చూపించలేకపోయారంటూ సమీక్షలు విశ్లేషిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కూడా అక్షయ్‌ను నిరాశపర్చినట్లే అనుకోవచ్చు. సినిమాలు అపజయాలు పాలవుతున్నా ఆయన జోరు తగ్గడం లేదు. ప్రస్తుతం అక్షయ్ ఖాతాలో ‘సెల్ఫీ’, ‘ఓ మై గాడ్ 2’, ‘సురారై పోట్రు’ రీమేక్, ‘కాప్స్యూల్ గిల్’ వంటి చిత్రాలున్నాయి.