హీరోలు ఏడాదికి ఒక సినిమా చేస్తే గొప్ప. కానీ నాయికల తీరే వేరు. అక్కడా ఉంటాం ఇక్కడా ఉంటాం అన్నట్లు ఏ హీరో సరసన చూసినా వాళ్లే కనిపిస్తారు. క్యాలెండర్ తిరిగే లోగా మూడు నాలుగు సినిమాలు చేసేస్తుంటారు. బాలీవుడ్ భామలకు ఈ జోరు అలవాటే. వరుస సినిమాల హోరులో ఉన్న ఆ తారలెవరో చూసేద్దాం
తీరికే లేని కత్రీనా
మన ‘మల్లీశ్వరి’ కత్రీనా కైఫ్ బాలీవుడ్‌ను ఏలడం మొదలుపెట్టి చాలాకాలమే అవుతున్నది. సల్మాన్, షారుక్, అమీర్ ఖాన్..ఇలా ముగ్గురు ఖాన్ హీరోలతో పాటు మిగతా అగ్రహీరోలందరితోనూ ఆడిపాడింది. విజయవంతమైన చిత్రాలతో ఏండ్లుగా అగ్రతారగా కొనసాగుతున్నది. కొత్త నాయికలు వచ్చినా కత్రీనా జోరు తగ్గలేదు. అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన ‘సూర్యవంశీ’ గతేడాది దీపావళి పండక్కి ప్రేక్షకుల ముందుకు రాగా..కొద్ది నెలల గ్యాప్ లోనే కొత్త చిత్రాల విడుదలకు సిద్ధమవుతున్నది కత్రీనా. ఆమె నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా ‘ఫోన్ బూత్’ జూలైలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్ చతుర్వేది హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు గుర్మీత్ సింగ్ రూపొందించారు. జూలై 15న ఈ సినిమా విడుదలవుతున్నది. కత్రీనా మరో సినిమా ‘మెర్రీ క్రిస్మస్’ ఏడాది చివరలో రిలీజ్ కానుంది. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా..శ్రీరామ్ రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉందీ సినిమా. సల్మాన్ సరసన కత్రీనా నటిస్తున్న ‘టైగర్ 3’ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.
భారీ సినిమాలతో ఆలియా భట్
ఇటీవలే ‘గంగూభాయ్ కథియావాడి’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకుంది ఆలియా భట్. వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఈ సినిమా నాయిక ప్రధాన చిత్రాల్లో కొత్త రికార్డ్‌లు సృష్టించింది. బాక్సాఫీస్ సక్సెస్‌తో పాటు తన నటనతో విమర్శకులను మెప్పించిందీ తార. ఇది ఆరంభమే అన్నట్లు మరో రెండు భారీ చిత్రాలతో ఈ ఏడాది తెరపైకి రానుంది ఆలియా. ఆమె నాయికగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఈనెల 25న విడుదలవుతున్నది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటించింది ఆలియా. ఆమె మరో భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొస్తున్నది. సూపర్ హీరో చిత్రంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఆలియా స్టార్‌డమ్‌ను, క్రేజ్‌ను మరింత పెంచనున్నాయి.
విభిన్న చిత్రాలతో కంగనా
ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రెండు సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించబోతున్నది. ఆమె ఏజెంట్ అగ్ని పాత్రలో నటించిన యాక్షన్ మూవీ ‘ధాకద్’. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, దివ్య దత్త ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రజినీష్ రాజీ భాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే లో తెరపైకి రాబోతున్నది. కంగనా ఫైటర్ జెట్ పైలట్ పాత్రలో నటించిన సినిమా ‘తేజస్’ కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. సర్వేష్ మేవరా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ శౌర్యాన్ని చూపించనుందీ చిత్రం. అక్టోబర్‌లో ‘తేజస్’ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అత్యధిక సినిమాలతో కృతి
ఈ ఏడాది అత్యధికంగా నాలుగు చిత్రాల్లో నటిస్తున్నది కృతి సనన్. అక్షయ్ కుమార్ సరసన ఆమె నటించిన ‘బచ్చన్ పాండే’ హోలీ పండక్కి విడుదలకు వస్తోంది. ఈ సినిమా కృతికి భారీ రిలీజ్ ఇస్తుండగా..మరో సినిమా ‘షెహజాద’ నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నది. తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ ‘అల వైకుంఠపురములో’ సినిమా హిందీ రీమేక్ గా ‘షెహజాద’ తెరకెక్కింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతుండగా..మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నది కృతి. వరుణ్ ధావన్‌తో కలిసి ‘భేడియా’ అనే హారర్ చిత్రంలో నటిస్తున్నదీ అందాల భామ. టైగర్ ష్రాప్ తో కలిసి ‘ఘనపత్’ అనే యాక్షన్ చిత్రంలోనూ భాగమవుతున్నది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు కూడా చేయబోతుందీ నాయిక.