Bhumi Pednekar | ‘భక్షక్’లో నా పాత్ర కథను నడిపిస్తుంది. అరుదుగా మాత్రమే ఇలాంటి పాత్రలు దొరుకుతాయి. ఓ విధంగా నా మానసిక స్థితిని మెరుగుపరచిందీ ఈ పాత్ర’ అంటున్నారు భూమి పెడ్నేకర్. వాస్తవ సంఘటనల ఆధారంగా పులకిత్ తెరకెక్కించిన చిత్రం ‘భక్షక్’. ఇందులో విశాలీ సింగ్‌గా నటించిన భూమికి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో భూమి ఆసక్తికరంగా మాట్లాడింది. ‘ఇదో విభిన్నమైన అనుభవం. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుండటం చాలా ఆనందంగా ఉంది.
ఇన్‌స్టా మొత్తం ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మా టీమ్ తరపున కృతజ్ఞతలు’ అన్నారు భూమి. ఇంకా చెబుతూ ‘సందేశాత్మక చిత్రాల్లో నటించడం నాకిష్టం. బ్యాంక్ బేలన్స్ నింపే పాత్రలు తరచూ వస్తూనేవుంటాయి. కానీ మనసు నిండా ఆనందాన్ని నింపే పాత్రలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. ఇది అలాంటి పాత్ర.’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు భూమి పెడ్నేకర్.