టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలలో భీమ్లా నాయక్ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల పై గత కొన్ని రోజులుగా అనేక రకాల సందేహాలు నెలకొన్నాయి. జనవరి 12న వస్తామని మేకర్స్ చెబుతున్నా కూడా ఆర్ఆర్ఆర్ నిర్మాతలు పవన్‌ని ఒప్పించి సినిమాని వాయిదా వేస్తారనే ప్రచారం జోరుగా నడుస్తుంది.
తాజాగా చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన టీజర్ ను రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 14న రానా 37వ వసంతంలోకి అడుగుపెడుతుండగా, ఆ రోజు ఒక పవర్ఫుల్ హై వోల్టేజ్ టీజర్ ను విడుదల చేయాలని ఇప్పటికే చిత్ర యూనిట్ ఒక ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం.
ట్రైలర్‌ని జనవరి మొదటి వారంలో 1వ తేదీ లేదా 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్‌కు ఇది తెలుగు రీమేక్‌గా రూపొందుతుంది. చిత్రంలో భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటే, డానియల్ శేఖర్‌గా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌కు మధ్య జరిగే ఈగో క్లాషెష్ ఈ సినిమా. తెలుగు నెటివిటీ, పవన్ కళ్యాణ్ ఇమేజ్ను బేస్ చేసుకుని త్రివిక్రమ్ కథలో మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది.