Bhagyashri Borse | టాలీవుడ్లో తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు సంబంధించిన ఓ బాలీవుడ్ వార్త తాజాగా ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్, దర్శకుడు మిలాప్ జవేరీ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ యాక్షన్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ హీరోయిన్గా ఎంపికైందంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై తాజాగా బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ స్పందించింది. ఈ ప్రచారాన్ని టీ-సిరీస్ ప్రతినిధులు అధికారికంగా ఖండించారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారనే విషయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు.
ఆదిత్య రాయ్ కపూర్, మిలాప్ జవేరీ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేమ, యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు దర్శకుడు మిలాప్ జవేరీ గతంలో వెల్లడించారు. ప్రేమకథలను తెరకెక్కించడంలో తనదైన శైలిని చూపించిన మిలాప్ జవేరీ.. ‘మర్జావాన్’, ‘ఏక్ దివానే కీ దివానియత్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి ఆదిత్య రాయ్ కపూర్‌తో మరింత ఇంటెన్స్ లవ్‌స్టోరీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భాగ్యశ్రీ బోర్సేకు బాలీవుడ్ కొత్తేమీ కాదు. ‘యారియాన్ 2’, ‘చందు ఛాంపియన్’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఆమె.. హీరోయిన్గా మాత్రం ఇప్పటివరకు పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకోలేదు. ఆదిత్య రాయ్ కపూర్ సినిమా ద్వారా బాలీవుడ్లో హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుందంటూ వచ్చిన వార్తలు కూడా ఇప్పుడు అవాస్తవంగా తేలాయి.
భాగ్యశ్రీ బోర్సే రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తన గ్లామర్‌తో పాటు నటనతోనూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమె తలుపు తట్టాయి.దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కాంత’ లోనూ భాగ్యశ్రీ నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి స్పందన లభించింది. అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రంలోనూ భాగ్యశ్రీ హీరోయిన్గా కనిపించింది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ సరసన కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘సేయోన్’ సినిమాలో నటిస్తోంది.