నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే..సుందరానికి’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ‘సంపూర్ణ హాస్యరసభరిత చిత్రమిది. ఈ సినిమాలో నాని పూర్తి పేరు కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్. అందరు సుందరం అని పిలుస్తుంటారు. జీవితాన్ని సరదాగా గడిపే అతనికి ఎదురైన అనూహ్య పరిస్థితులేమిటి? వాటి నుంచి అతను ఎలా బయటపడ్డాడన్నదే కథ. నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తున్నది’ అని చిత్రబృందం తెలిపింది. నదియ, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.