తెలంగాణ యాస, సంస్కృతీ సంప్రదాయాలు వెండితెరపై వెలుగులీనుతున్నాయి. తెలంగాణ నేపథ్యం సినిమాల్లో ప్రధాన ఆకర్షణ అవుతున్నది. తాజాగా బాలీవుడ్ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రంలో బతుకమ్మ పాటను తెరకెక్కించడం మన పూల పండగ దేశీయ ఖ్యాతికి నిదర్శనం. హిందీ సినిమాలో బతుకమ్మ పాటను రూపొందించడం ఇదే తొలిసారి. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో వెంకటేష్, పూజా హెగ్డే, భూమిక కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నుంచి బతుకమ్మ పాటను విడుదల చేశారు. ఈ పాటలో తెలుగు సాహిత్యాన్ని రాయడం విశేషం. ‘ముంగింట్లో ముగ్గెట్టి గొబ్బిల్లే పెట్టుదామా..గడపకు బొట్టెట్టి తోరణాలు కట్టుదామా..గునుగూ తంగేడు పూలు, బంతి, చామంతి పూలు, తామర గుమ్మడి పూలు, దోసపూలు కట్లపూలతో గౌరమ్మను సిద్ధం చేసేద్దామా..ప్రతి ఇళ్లూ బతుకమ్మ పండగ చేసేద్దామా…’ అంటూ సాగుతుందీ పాట. ఈ పాటను రవి బస్రూర్ స్వరకల్పనలో కిన్నల్ రాజ్, హరిణి ఇవటూరి సాహిత్యాన్ని అందించగా..సంతోష్ వెంకీ పాడారు. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కాబోతున్నది. సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాటను చిత్రీకరించడంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు బతుకమ్మ క్రేజ్ పాన్ ఇండియాకు చేరిందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.