‘సంక్రాంతి అంటే మా కుటుంబానికి చాలా ప్రత్యేకం. అన్నపూర్ణ స్టూడియోస్‌ను ఈ పండుగనాడే ఆరంభించాం. నాన్న నటించిన ‘దసరా బుల్లోడు’ సంక్రాంతికి విడుదలై అప్పట్లో అఖండ విజయాన్ని సాధించింది’ అన్నారు నాగార్జున. ఆయన తనయుడు నాగచైతన్యతో కలిసి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ ‘తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 17.5కోట్ల వసూళ్లు సాధించింది. ‘బంగార్రాజు’ సినిమా చూసి ఇంటికి రాగానే అమల మా అమ్మానాన్న ఫొటోలకు దండం పెట్టుకొని ఏడ్చింది. ఆనందంతో కూడిన కన్నీళ్లతో.. వాళ్లు మనల్ని చూసుకుంటున్నారు కదా అని చెప్పింది. ఈ సినిమా చూసిన వారందరూ వాళ్ల అమ్మమ్మ, తాతయ్యలను గుర్తుకు తెచ్చుకుంటున్నామని చెప్పడం ఆనందంగా ఉంది’ అన్నారు. గ్రామీణ నేపథ్యంలో తాను చేసిన తొలి సినిమాకు మంచి ఆదరణ దక్కడం సంతోషంగా ఉందని నాగచైతన్య చెప్పారు. ప్రేక్షకులు ఓ పండుగలా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని దర్శకుడు కల్యాణ్‌కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.