అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘NBK 111’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇందులో బాలకృష్ణ పోషిస్తున్న పాత్రలో రెండు కోణాలుంటాయని, ఒక కోణంలో ఆయన అండర్‌వరల్డ్ డాన్‌గా కనిపిస్తే, మరో కోణంలో ఓ గొప్ప వంశానికి చెందిన వ్యక్తిగా, పేదలపాలిటి పెన్నిధిగా అగుపిస్తారట. ఇటీవలే ముంబైలో ఈ సినిమా భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్నది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ, మంచు మనోజ్, కాజల్ అగర్వాల్, శరత్‌కుమార్, నరేశ్ తదితరులు ఈ షూట్లో పాల్గొంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర నిర్మాత వెంకటసతీశ్ కిలారు ముందుగా భావించారు. అయితే.. నిర్మాణం త్వరగా పూర్తి కానుండటం, సంక్రాంతి సీజన్లో పోటీ అధికంగా ఉండటం తదితర కారణాల దృష్ట్యా ఒక నెల ముందే, అంటే డిసెంబర్లోనే సినిమా విడుదల చేయాలని ఆయన నిర్ణయించారట. డిజిటల్ భాగస్వాములు సైతం డిసెంబర్ రిలీజ్ వైపే మొగ్గు చూపారట. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.