Ayushmann Khurrana | విభిన్న కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించి డిఫరెంట్ నటుడు అని నిరూపించుకున్నాడు ఆయుష్మాన్ ఖురానా. ఈ బాలీవుడ్ బాబు కాల్షీట్లు ఇప్పుడు చాలా కాస్ట్లీ! వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న ఆయుష్మాన్.. తనకు నెగెటివ్ రోల్స్ చేయాలని ఉందంటున్నాడు. ‘ఇప్పటివరకు మంచి పాత్రలు ఎన్నో చేశాను. అయితే, అవన్నీ పాజిటివ్ రోల్సే! ‘దమ్ లగాకే హయీషా..’లో ప్రకాశ్ తివారీ పాత్ర, ‘చండీగఢ్ కరే ఆశికీ’లో మన్విందర్ ఇలా పక్కా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పాత్రలు ఎన్నో చేశాను.
యాక్షన్ హీరోగానూ ప్రేక్షకులు నన్ను ఆదరించారు. అయితే, హార్డ్‌కోర్ నెగెటివ్ రోల్ చేయాలన్నది నా కల. ఇప్పటి వరకు ఎందుకో అలాంటి పాత్ర నా దగ్గరికి రాలేదు. వస్తే మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు’ అని చెప్పుకొచ్చాడు ఆయుష్మాన్. షోలే చిత్రంలో అంజాద్‌ఖాన్ చేసిన గబ్బర్‌సింగ్ పాత్రంటే అతనికి ఎంతో ఇష్టమట. ‘ధూమ్ 3లో అమీర్ ఖాన్ చేసిన నెగిటివ్ రోల్ భలేగా ఉంటుంది. అలాంటి పాత్రలు నాకు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నా’ అని మనసులో మాట బయటపెట్టాడు యంగ్‌హీరో ఆయుష్మాన్.