Avika Gor | తెలుగు ప్రేక్షకులకు ‘చిన్నారి పెళ్లికూతురు’గా ఎంతో దగ్గరైన అవికా గోర్ ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. టెలివిజన్ సీరియల్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అవికా.. తరువాత తెలుగు సినిమాల్లో హీరోయిన్గా కూడా మంచి అవకాశాలు అందుకుంది. అయితే గత కొంతకాలంగా ఆమె సినీ కెరీర్ ఊహించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ఇటీవల నటించిన కొన్ని సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇలాంటి సమయంలో అవికా గోర్ తీసుకున్న తాజా నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె తన నివాసాన్ని భారతదేశం నుంచి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు మార్చేసినట్లు తెలుస్తోంది. పర్సనల్‌గా ఎదగడంతో పాటు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆలోచనతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అవికా వెల్లడించింది.
బ్యాంకాక్ నగరం తనకు ఎంతో ఇష్టమని, అక్కడి జీవనశైలి తనను బాగా ఆకట్టుకుందని ఆమె తెలిపింది. ప్రశాంతమైన వాతావరణం, కొత్త సంస్కృతి, స్వేచ్ఛాయుత జీవనం తనలోని సృజనాత్మకతను మరింత పెంచుతాయని అవికా భావిస్తోంది. అయితే తాను భారతీయ చిత్ర పరిశ్రమకు దూరం కావడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తన చేతిలో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయని, షూటింగ్స్ ఉన్నప్పుడు ఇండియాకు వచ్చి పని పూర్తి చేసుకుని తిరిగి బ్యాంకాక్ వెళ్తానని తెలిపింది. నేటి డిజిటల్ యుగంలో భౌగోళిక దూరాలు పెద్ద సమస్య కాదని, ఎక్కడి నుంచైనా కథా చర్చల్లో పాల్గొనవచ్చని ఆమె అభిప్రాయపడింది.
నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అవికా ప్లాన్ చేస్తోంది. థాయ్‌లాండ్‌లో నివసించడం వల్ల అక్కడి చిత్ర పరిశ్రమతో పాటు అంతర్జాతీయ నిర్మాణ సంస్థలతో పరిచయాలు పెంచుకోవడం సులభమవుతుందని ఆమె భావిస్తోంది. భవిష్యత్తులో భారతీయ, థాయ్ చిత్ర పరిశ్రమల మధ్య కొత్త తరహా భాగస్వామ్యాలు తీసుకురావాలనే ఆలోచన కూడా ఆమెకు ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే థాయ్ భాషా సినిమాల్లో నటించే అవకాశాలను కూడా అవికా పరిశీలిస్తోంది. భారతీయ సినిమాల్లో నటిస్తూనే ఆసియా మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా అవికా తీసుకున్న ఈ నిర్ణయం నేటి తరం నటీనటుల గ్లోబల్ ఆలోచనా విధానానికి నిదర్శనంగా మారింది.