సన్నీలియోన్ అనగానే ఆమె అందం గురించే మాట్లాడుతారు. ఆమె తనువు మాత్రమే కాదు, మనసూ అందమైనదే! వివాదాస్పద పాత్రల్లో నటించినా.. వివక్ష, బెదిరింపులు ఎదుర్కొన్నా.. సమాజాన్ని ప్రేమించడంలో సన్నీలియోన్ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఈ తార గురించి ప్రపంచానికి తెలిసింది ఒకవైపే. ఆమెలో మరో కోణమూ ఉంది. అదేమిటో మీరే చదవండి..
పిల్లలంటే ఎంతో ఇష్టపడే సన్నీలియోన్ మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామానికి చెందిన పేదింటి చిన్నారిని దత్తత తీసుకుంది. ఆమెకు దిశ అని పేరు పెట్టింది. సరోగసి ద్వారా కవల మగబిడ్డలకు జన్మనిచ్చింది. వారికి నోహ్, ఆషర్ అని పేర్లు పెట్టింది. ముగ్గురు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నది. ప్రత్యేక పాటల షూటింగ్ సమయంలో.. చుట్టుపక్కల చిన్నపిల్లలు ఎవరూ ఉండొద్దని సన్నీ కండిషన్ పెడుతుందట. కో డ్యాన్సర్లనూ గౌరవంగా చూడాలని చెబుతుందట.
చాలా స్వచ్ఛంద సంస్థల్లో సన్నీకి సభ్యత్వం ఉంది. చారిటీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. సొంతంగానూ నిర్వహిస్తున్నది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) వంటి సంస్థల్లో సభ్యురాలు కూడా. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్నో మారథాన్స్, ఫండ్ రైజింగ్
క్యాంపెయిన్స్, అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. తద్వారా వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవకు వెచ్చించింది. ముంబైలోని ఒక మురికివాడలో 300మంది పిల్లలు చదువుతున్న బడిని సన్నీ దత్తత తీసుకుంది. పిల్లలకు కావాల్సిన వస్తువులు, పుస్తకాలు, ఇతర నిత్యావసరాలు అన్నీ సమకూర్చింది. ఎంత బిజీగా ఉన్నా తరచూ ఆ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అన్నీ అందుతున్నాయో లేదో గమనిస్తుంది. వాళ్ల యోగక్షేమాలు తెలుసుకుంటుంది.
సన్నీలియోన్ 2011లో డానియెల్ వాబర్ని పెళ్లి చేసుకుంది. ఆమె షెడ్యూల్స్ అన్నీ ఆయనే చూసుకుంటాడు. వీరిద్దరి అన్యోన్యత ఏ రేంజ్లో ఉంటుందో వారి సోషల్ మీడియా అకౌంట్లలోనే కనిపిస్తుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను సన్నీ అక్షరాలా పాటిస్తున్నది. ‘లస్ట్’ అనే బ్రాండ్ పేరుతో సన్నీ సొంత పర్ఫ్యూమ్ కంపెనీ నడిపిస్తున్నది. దాని విలువ రూ.65 కోట్లు. ముంబై, హైదరాబాద్లో సొంతిల్లు కొనుక్కుంది.
సన్నీకి భోజనమంటే చాలా ఇష్టం. రకరకాల వంటలు వండటం సరదా. పంజాబీ కుటుంబంలో పుట్టిన సన్నీ షూటింగ్స్ లేకపోతే పొద్దున్నే భర్తతో కలిసి వంటింట్లో దూరిపోతుంది. వేపుళ్లు, కూరలు, చారు, బిర్యానీ.. అన్నీ వండేస్తుందట. ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ సిద్ధంచేసి.. పిల్లలతో కలిసి కబుర్లు చెప్పుకొంటూ తింటారట. ఇలా గడపడం అంటే సన్నీకి చాలా ఇష్టమట. దేవుడు ప్రత్యక్షమై ‘ఏం కావాలో కోరుకో..’ అంటే తన జీవితం ఇలానే సరదాగా సాగిపోవాలని ప్రార్థిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తనపై ఎన్ని విమర్శలొచ్చినా.. వివాదాలు సృష్టించినా.. బెదిరింపు లేఖలు అందినా, ఫోన్లు చేసినా ..
సన్నీ మాత్రం ధైర్యం కోల్పోలేదు. అన్నిటినీ ఓపికగా భరించింది. అన్ని రకాల పరిస్థితులనూ చూసింది. అడల్ట్ మూవీస్ వదిలేసి.. సినిమాల్లో నటిస్తున్న కొత్తలో ఆమెకు చాలా బెదిరింపులు వచ్చాయి. ‘అశ్లీల సినిమాల్లో నటించే నువ్వు.. వెండితెరపై కనిపించడానికి వీల్లేదు. సినిమాల్లో నటిస్తే చంపేస్తామ’ని హెచ్చరించారు. ఆ సమయంలో అండగా ఎవరూ రాకపోయినా అధైర్యపడలేదు. మానసిక బలం ఉంటే.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తట్టుకొని నిలబడొచ్చు అని నమ్మింది. అంతే తప్ప.. ఎవరి మీదా ప్రతి విమర్శలు చేయలేదు.