Sukumar | టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కేవలం విజయవంతమైన సినిమాలు తెరకెక్కించడమే కాకుండా, ఇండస్ట్రీకి పలువురు ప్రతిభావంతులైన దర్శకులను అందించిన గురువుగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన అనేక మంది దర్శకులు ప్రస్తుతం టాలీవుడ్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో కొత్త దర్శకుడు చేరనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. సుకుమార్ సోదరుడి కుమారుడు బాబీ త్వరలో దర్శకుడిగా పరిచయం కానున్నారు. గత కొంతకాలంగా సుకుమార్ వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాబీ.. ఆయన సినిమాలతో పాటు పలు ప్రాజెక్ట్‌లలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు పూర్తి స్థాయి దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బాబీ దర్శకత్వంలో రూపొందనున్న తొలి చిత్రంలో యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కథను సిద్ధుకు వినిపించగా, ఆయనకు నచ్చడంతో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సుకుమార్ క్యాంప్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడం, కథ కూడా నచ్చడంతో సిద్ధు ఈ సినిమాకు అంగీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ వద్ద పనిచేసిన శిష్యుల తొలి చిత్రాలు ఎక్కువగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లోనే రూపొందాయి. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బాబీ తొలి సినిమాను కూడా సుకుమార్ నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముందని సమాచారం. ఈ సినిమాకు సుకుమార్ కేవలం నిర్మాతగానే కాకుండా, కథా అభివృద్ధి, స్క్రీన్‌ప్లే, మేకింగ్ విషయంలో కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుడు దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో, తొలి సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. సుకుమార్ శిష్యులుగా వచ్చిన పలువురు దర్శకులు ఇప్పటికే ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారు. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు సానా ఇటీవల తెరకెక్కించిన ‘పెద్ది’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. దీంతో ఇప్పుడు బాబీపై కూడా సహజంగానే అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు. ఇప్పటికే రామ్ చరణ్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఆయన, త్వరలో ఆ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు బాబీ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.