దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా మహేశ్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వరరాజన్ కథానాయిక. ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని అగ్ర హీరో నాని విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘కన్నుదాటి జారే నీటిలో.. దాచుకున్న ప్రేమే నువ్వనీ.. గొంతులోనే ఆగే మాటలో.. చెప్పుకోనీ బాధే నువ్వనీ..’ అంటూ ఈ పాట ప్రోమో సాగింది. కల్యాణ్‌చక్రవర్తి రాసిన ఈ పాటను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరపరచగా, మరో స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ ఆలపించడం విశేషం. ఈ పాటలో సంజన ఆలపించిన కర్ణాటిక్ నోట్స్, హర్షవర్ధన్ ర్యాప్ సెగ్మెంట్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. దూరం నుంచి హీరోయిన్ని ప్రేమించే హీరో ప్రేమభావాలను ఈ పాట ఆవిష్కరిస్తున్నది. ఈ పాటలో హీరో అనీష్ డాన్స్, విజువల్‌గా ఫ్రెష్ ఫీల్ ఇస్తున్నది. అనస్వరరాజన్ అందంగా, గంభీరంగా పాటకు ఆకర్షణగా నిలిచింది.