Anil Ravipudi | టాలీవుడ్లో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టుల్లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కనున్న చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.సినిమా ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్‌కు అనీల్ రావిపూడి ఎంటర్టైనింగ్ టచ్ జతకావడంతో ఇది పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందనున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు అనీల్ రావిపూడి ఆయన టీమ్ ప్రస్తుతం విశాఖపట్నంలో మకాం వేసి స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనుల్లో నిమగ్నమై ఉన్నారని తెలుస్తోంది. కథ, పాత్రలు, సన్నివేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాన్ని సిద్ధం చేయాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు సమాచారం.స్క్రిప్ట్ పనులు పూర్తయిన వెంటనే సినిమా అధికారికంగా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత ఈ మల్టీస్టారర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే అధికారిక ప్రకటనలతో మరింత హైప్‌ను సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అనీల్ రావిపూడి ఈ సినిమాతో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం.