పుట్టినరోజును ఉత్సాహంగా జరుపుకునేందుకు ఎదురుచూస్తుంటానని చెప్పింది బాలీవుడ్ తార అనన్య పాండే. బర్త్డే వచ్చిన నెల, వారం కూడా సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పిందీ నాయిక. తన జీవితంలో బాగా ఆస్వాదించిన పుట్టినరోజులన్నీ చిన్నప్పటివే అని తెలిపింది. ఆదివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతూ…‘ఈ పుట్టిన రోజుతో ఇంకో ఏడాది వయసు మీద పడిందనే బాధ కంటే మరింత మానసికంగా పరిణితి సాధిస్తున్నా అనేది సంతోషాన్నిస్తున్నది. గత పుట్టినరోజున ‘గెహ్రియాన్’ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నా. ఇప్పుడు కొత్త చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నా. ఇప్పుడు ఎంత ఆర్భాటంగా పుట్టినరోజు జరుపుకున్నా, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేవి చిన్నప్పటి వేడుకలే. బాల్యంలోని అమాయకత్వం, స్వచ్ఛత, ప్రతి చిన్న బహుమతికీ మురిసిపోవడం మధుర జ్ఞాపకాలు. పుట్టినరోజు కూడా పనిచేస్తే ఏడాదంతా బిజీగా ఉంటానని నాన్న చెప్పేవారు. నటిగా నిరంతరం శ్రమిస్తూ ప్రతిభను మెరుగుపర్చుకోవాలనుకుంటున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె ‘ఖో గహే హమ్ కహాన్’, ‘డ్రీమ్ గర్ల్ 2’ చిత్రాల్లో నటిస్తున్నది.