Allu Arjun Fans Association | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ తెలుగు రాష్ట్రాల సరిహద్దులు దాటి జాతీయ స్థాయిలో ఏ విధంగా మారుమోగుతుందో మరోసారి నిరూపితమైంది. తాజాగా మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) తన ప్రభావాన్ని మరింత విస్తరిస్తూ ఒక చారిత్రక అడుగు వేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదికగా జరిగిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మహారాష్ట్ర రాష్ట్ర కమిటీని అధికారికంగా ఏర్పాటు చేశారు. కేవలం రాష్ట్ర స్థాయికే పరిమితం కాకుండా, మహారాష్ట్ర వ్యాప్తంగా అభిమాన సంఘాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఏకంగా పది ప్రధాన జిల్లాల్లో నూతన కమిటీలను ప్రకటించడం విశేషం.
ముంబై, పుణే, నాందేడ్, పరభణి, సోలాపూర్, షిర్డీ, హింగోలి, పాలం, ఉమ్రి మరియు గడ్చిరోలి వంటి ముఖ్యమైన జిల్లాల్లో నూతన జిల్లా కమిటీలు కొలువుదీరాయి. ఈ విస్తరణతో మహారాష్ట్ర నలుమూలలా అల్లు అర్జున్ అభిమాన బలగం ఒకే తాటిపైకి వచ్చి సంఘటితంగా పనిచేసేందుకు మార్గం సుగమమైంది. కేవలం సినిమాల పరంగానే కాకుండా, సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుండే అల్లు అర్జున్ స్పూర్తితో, ఈ కొత్త కమిటీలు అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి.
అందులో భాగంగానే ‘ప్రతి సంవత్సరం ఒక మంచి పని’ (One Good Deed Every Year) అనే AAFA ప్రధాన లక్ష్యానికి అనుగుణంగా, సమాజంలో అత్యంత కీలకమైన అంశంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ప్రజల్లో హెచ్పివి (HPV) వ్యాధితో పాటు దాని నివారణ, వ్యాక్సినేషన్‌పై అవసరమైన అవగాహన కల్పించే బృహత్తర కార్యక్రమాలను ఈ అసోసియేషన్ చేపట్టింది. సినిమా అభిమానులంటే కేవలం కోలాహలం మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతలోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరోసారి చేతల్లో నిరూపిస్తున్నారు. ఈ నూతన కమిటీల ఏర్పాటుతో మహారాష్ట్రలో ఐకాన్ స్టార్ ఫ్యాన్ బేస్ మరింత పటిష్టమైందని చెప్పవచ్చు.