Ajay Gosh | తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఘోష్.. ఇటీవల సినిమా వేడుకల్లో చేస్తున్న కొన్ని వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా హీరోల ఆస్తులు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల గురించి ఆయన ప్రస్తావిస్తున్న విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా ఓ సినిమా కార్యక్రమంలో హీరో నవదీప్ కుటుంబానికి సంబంధించిన పాత ఆస్తి గురించి అజయ్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అజయ్ ఘోష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నవదీప్ తండ్రి రామారావు 2002లో చీరాల బీచ్ సమీపంలో ఓ రిసార్ట్‌ను ఏర్పాటు చేశారు. దానికి ‘రామాపురం రిసార్ట్స్’ అనే పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు. అప్పట్లో ఆ ప్రాంతం ఇప్పటిలా పెద్దగా అభివృద్ధి చెందకపోయినా, భవిష్యత్తులో అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఆయన ఆ ప్రాపర్టీని ఏర్పాటు చేసినట్లు అజయ్ ఘోష్ పేర్కొన్నారు.
కాలక్రమంలో నవదీప్ కుటుంబం హైదరాబాద్‌కు పూర్తిగా మారడంతో ఆ రిసార్ట్‌ను విక్రయించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం చీరాల బీచ్ పరిసర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో అక్కడ భూముల విలువ భారీగా పెరిగిందని అజయ్ ఘోష్ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో నవదీప్ కుటుంబం ఆ రిసార్ట్‌ను విక్రయించకుండా తమ వద్దే ఉంచుకుని ఉంటే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ప్రకారం దాని విలువ వందల కోట్ల రూపాయలకు చేరి ఉండేదని అజయ్ ఘోష్ అభిప్రాయపడ్డారు. భూముల ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రాపర్టీ ఇప్పుడు ఉండి ఉంటే నవదీప్‌కు ఎంతో విలువైన ఆస్తిగా మారేదని ఆయన కామెంట్ చేశారు.
నవదీప్ ఆస్తి గురించి మాత్రమే కాకుండా.. ఇటీవల మరో సినిమా వేడుకలో మాస్ మహారాజ్ రవితేజకు సంబంధించిన రియల్ ఎస్టేట్ గురించి కూడా అజయ్ ఘోష్ మాట్లాడిన విషయం తెలిసిందే. శంకర్పల్లి పరిసరాల్లో రవితేజ గతంలో తక్కువ ధరకు భారీ విస్తీర్ణంలో మామిడి తోటను కొనుగోలు చేశారని, ప్రస్తుతం దాని విలువ గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా రవితేజ చెప్పినట్లు అజయ్ ఘోష్ పేర్కొన్న కొన్ని మాటలను కూడా గుర్తుచేశారు. ఆస్తులు, డబ్బు కంటే మనం చేసే పని, మన ప్రయాణమే ముఖ్యమనే భావనతో రవితేజ స్పందించిన తీరు తనకు నచ్చిందని అజయ్ ఘోష్ ప్రశంసించారు. సినీ వేడుకల్లో హీరోల ఆస్తులు, భూముల గురించి అజయ్ ఘోష్ చేస్తున్న వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వ్యక్తం అవుతున్నాయి.