The Raja Saab | ఈ ఏడాది ప్రారంభంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాపై రిలీజ్కు ముందు భారీ హైప్ నెలకొన్నప్పటికీ, థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను సైతం ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మారుతిపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. కథ, స్క్రీన్ప్లే, ట్రీట్మెంట్ విషయంలో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా డిసప్పాయింట్ అయ్యింది.
ఇప్పుడు ‘ది రాజా సాబ్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రముఖ ఛానల్ స్టార్ మాలో ఈ ఆదివారం, ఏప్రిల్ 26, 2026న సాయంత్రం 5:30 గంటలకు ప్రసారం కానుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత కేవలం నాలుగు నెలల్లోనే టీవీలోకి రానుండడం విశేషంగా మారింది. థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా, ఇప్పుడు టీవీ ఆడియన్స్ను ఎంతవరకు ఆకట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా కొన్ని సినిమాలు థియేటర్లలో ఫెయిల్ అయినా, టీవీ లేదా ఓటీటీలో మంచి ఆదరణ పొందిన సందర్భాలు ఉన్నాయి. అదే మ్యాజిక్ ‘ది రాజా సాబ్’కు పనిచేస్తుందా లేదా అన్నది చూడాలి.
ది రాజా సాబ్ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్, జరీనా వహాబ్, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా, సంగీతాన్ని ఎస్. థమన్ అందించారు. మరి థియేటర్లలో తడబడిన ‘ది రాజా సాబ్’ టీవీ ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈసారి ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా స్వీకరిస్తారో చూడాలి.