Adah Sharma | దాదాపు పదేండ్ల కిందటే తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చినా..ఆశించిన గుర్తింపు ఆదా శర్మకు దక్కలేదు. ఈ అందాల తారకు ప్రతిభ ఉన్నా అదృష్టం కలిసి రాలేదు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘కల్కి’ వంటి చిత్రాలు ఆమెకు ఓ హీరోయిన్‌కు కావాల్సిన కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం ఆమె పలు భాషల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నది. ఇటీవల ‘ది కేరళ స్టోరి’ సినిమాలో నటించిన ఆదా మరోసారి వెలుగులోకి వచ్చింది. తన కెరీర్ గురించి ఆదా శర్మ మాట్లాడుతూ…
‘నట ప్రయాణంపై నాకు భారీ ఆశలేం లేవు. కానీ ప్రేక్షకులు నన్ను ప్రతిసారీ కొత్తగా చూడాలని కోరుకుంటారు. వాళ్లకు నాపై నమ్మకం ఉంది. అది నిలబెట్టుకోవాలనే ప్రయత్నిస్తుంటా. నేను చేసే ప్రతి సినిమా చివరి చిత్రమే అనుకుంటా. ఎందుకంటే మరో అవకాశం వస్తుందో లేదో తెలియదు. మరో దర్శక నిర్మాత నాపై నమ్మకం ఉంచుతారో లేదో చెప్పలేం. స్టార్ హీరోల సరసనే నటించాలనే కోరికలు లేవు. నటించేందుకు ఆస్కారముంటే..చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేందుకైనా సిద్ధం’ అని చెప్పింది.