Bollywood drugs case | గత కొంత కాలంగా ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో డ్రగ్స్ కలకలం మరి ఎక్కువైంది. గతేడాది షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ మీద డ్రగ్స్ కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఇటీవలే క్లీన్చిట్ వచ్చింది. కాగా తాజాగా మరో బాలీవుడ్ సెలబ్రిటీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు, సీనియర్ యాక్టర్ శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్ డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్నాడు.
ఆదివారం రాత్రి బెంగళూరులోని ఎంజీ రోడ్లో ఓ హోటల్లో జరుగుతున్న పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు ఆ హోటల్‌కు వెళ్ళి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో నటుడు సిద్ధాంత్ కూడా ఉన్నాడు. వీరి శాంపిల్స్ టెస్టింగ్‌కు పంపగా.. ఆరుగురికి పాజిటీవ్‌గా వచ్చాయి. ఆ ఆరుగురిలో సిద్ధాంత్ ఒకడు. కాగా సిద్ధాంత్ పలు బాలీవుడ్ సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అంతేకాకుండా కొన్ని సినిమాలలో కూడా నటించాడు.