Actor Vishal | తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన కేబినెట్ మంత్రులకు శాఖలను కేటాయించడాన్ని స్వాగతిస్తూనే, సినిమాటోగ్రఫీ శాఖ కేటాయింపుపై ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చలనచిత్ర సాంకేతికత మరియు సినిమాటోగ్రాఫ్ చట్టం (Film Technology and Cinematograph Act) మంత్రిగా రాజ్‌మోహన్‌ను నియమించడం పట్ల ఆయన కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో క్షేత్రస్థాయి నుంచి ఉంటూ, పరిశ్రమ కష్టసుఖాలు తెలిసిన సీఎం విజయ్ కాకుండా… సినిమా రంగంపై కనీస అవగాహన మరియు అనుభవం లేని వ్యక్తికి ఈ శాఖను కేటాయించడం పట్ల విశాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్న చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా నిర్మాతలు తమ సమస్యలను మరియు సంస్కరణలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇది ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటం కాదని, కేవలం పరిశ్రమ బాగు కోసమే తన అభిప్రాయాన్ని పంచుకుంటున్నానని స్పష్టం చేశారు. గత 9 ఏళ్లుగా పరిష్కారం కాని పలు కీలక డిమాండ్లను సీఎం విజయ్ దృష్టికి తీసుకెళ్తూ విశాల్ మూడు ముఖ్యమైన విజ్ఞప్తులు పంచుకున్నాడు.
1. ప్రభుత్వ టికెటింగ్ విండోను తీసుకురావాలి
ప్రస్తుతం ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ కోసం ప్రేక్షకులు అదనంగా రూ. 30 వరకు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం తరఫునే ఒక అధికారిక టికెటింగ్ పోర్టల్‌ను ప్రవేశపెడితే, అది ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా, సామాన్య ప్రేక్షకులకు కూడా భారీ ఉపశమనం కలిగిస్తుందని విశాల్ కోరారు.
2. లోకల్ బాడీ టాక్స్ (స్థానిక సంస్థల పన్ను) రద్దు చేయాలి
దేశవ్యాప్తంగా “ఒకే దేశం, ఒకే పన్ను” (GST) విధానం అమలులో ఉన్నప్పటికీ, మన రాష్ట్రంలో మాత్రం సినిమా టికెట్లపై అదనంగా లోకల్ బాడీ టాక్స్ విధిస్తున్నారని విశాల్ గుర్తుచేశారు. దేశంలో రెండు రకాల పన్నులు వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని, ఈ పన్నును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
3. చిన్న సినిమాలకు సబ్సిడీని పెంచాలి
ప్రస్తుతం చిన్న సినిమాలకు ఇస్తున్న సబ్సిడీ మొత్తం చాలా తక్కువగా ఉందని, దానిని మరింత పెంచి, ప్రతి ఏటా చిన్న చిత్రాల నిర్మాణానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులను గత 9 ఏళ్లుగా ప్రతినిధుల ద్వారా పంపుతూనే ఉన్నాం. సినిమా రంగం నుంచి వచ్చిన మన ముఖ్యమంత్రి విజయ్ మాత్రమే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, చిత్ర పరిశ్రమకు ఒక కొత్త ఆశాకిరణంలా నిలవగలరని ఆశిస్తున్నాను. అని విశాల్ తన పోస్ట్‌లో పేర్కొంటూ సీఎంవో తమిళనాడు (@CMOTamilnadu) ఖాతాను ట్యాగ్ చేశారు.
Happy to see #CMJosephVijay allocating ministries to respective elected MLAs but it’s disheartening to see honorable minister #Rajmohan to be in charge as minister of Film Technology and Cinematograph Act. How would I or we as a body or as an association render our requests or…
— Vishal (@VishalKOfficial) May 17, 2026