విజయాలు వచ్చిన రోజే ఏదో ఒకనాడు అపజయాలూ పలకరిస్తాయని తెలుసని, అందుకు సిద్ధమయ్యే ఉన్నానని అంటున్నారు హీరో నాని. మన చుట్టూ జరిగే కథలు, సహజమైన పాత్రలను ఎంచుకుంటూ నేచురల్ స్టార్‌గా ఎదిగారు నాని. అయితే గత కొద్ది కాలంగా కథల ఎంపికలో నాని స్ట్రాటజీ వర్కవుట్ కావడం లేదు. ‘వీ’, ‘టక్ జగదీశ్’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికీ’ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ గత నాలుగు చిత్రాలు ఆయనను కథల ఎంపికలో ఆలోచనలో పడేశాయి. తన కెరీర్‌పై ఇటీవల నాని స్పందిస్తూ…‘ఒక్క రోజులో నేను స్టార్‌ను కాలేదు. వరుస విజయాలు వచ్చినప్పుడే, ఏదో ఒక రోజు అపజయాలూ వస్తాయని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. వాస్తవికతతో ఉండే వ్యక్తిత్వం నాది. ఇకపైనా వినూత్నమైన కథలను ఎంచుకుంటూ కొనసాగుతాను. సినిమాలో నటించడం నాకిష్టం. నేను ప్రేమించే పని చేసే అవకాశం దక్కినందుకు ఆనందిస్తా’ అని చెప్పారు. ప్రస్తుతం నాని ‘దసరా’ చిత్రంలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ నాయికగా నటిస్తున్నది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు.