విమాన ప్రయాణం చేసే ప్రతీసారి తాను పాటించే ఓ సెంటిమెంట్ గురించి అగ్ర నటుడు అమీర్‌ఖాన్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు. ఒకవేళ విమానం ప్రమాదానికి గురై తాను చనిపోతే సినిమాల పరంగా చేయాల్సిన పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు తన కజిన్, నిర్మాత మన్సూర్ఖాన్కు ఓ చిన్నలేఖ ద్వారా ముందే అన్ని విషయాలను తెలియజేస్తానని అమీర్‌ఖాన్ చెప్పారు. ‘విమాన ప్రయాణం చేసే ముందు మన్సూర్‌కు చిన్న చీటీ రాయడం నాకు అలవాటు. దాదాపు 30 ఏళ్లుగా ఇదే పద్ధతిని పాటిస్తున్నా. ఒకవేళ ఏదైనా జరగకూడనిది జరిగితే సినిమాల నిర్మాణానికి అడ్డంకులు రావొద్దన్నది నా ఆలోచన. అందుకే మిగిలిన పనుల గురించి మన్సూర్‌కు ముందే తెలియజేస్తా.
దర్శకులను కూడా మన్సూర్ సలహా తీసుకోవాలని సూచిస్తా. నాకు మన్సూర్ జడ్జిమెంట్ మీద అంత నమ్మకం’ అని అమీర్‌ఖాన్ చెప్పారు. తన మాజీ భార్య కిరణ్‌రావుకు చాలా సందర్భాల్లో ఈ సెంటిమెంట్ గురించి చెప్పానని, తనకు ఏమైనా జరిగితే అన్ని విషయాలను మన్సూర్ఖాన్ పరిష్కరిస్తాడని, సలహాల కోసం ఆయన్నే సంప్రదించాలని కిరణ్‌రావుకు గుర్తుచేసేవాణ్ణని అమీర్‌ఖాన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అమీర్‌ఖాన్ తొలి చిత్రం ‘ఖయామత్ సే ఖయామత్ తక్’కు (1988) మన్సూర్ఖాన్ దర్శకత్వం వహించారు. అప్పటి నుంచి వీరి అనుబంధం కొనసాగుతున్నది. మన్సూర్ఖాన్ సలహాలు తీసుకోకుండా అమీర్‌ఖాన్ ఏ పని తలపెట్టడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.