ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు తమ 15 ఏళ్ల వివాహ బంధానికి తెరదించబోతున్నారన్న వార్త అతని అభిమానులను షాక్కు గురి చేసింది. ఈ ఇద్దరూ శనివారం తాము విడిపోతున్నట్లు ఒక సంయుక్త ప్రకటనలో చెప్పారు. తాజాగా ఆదివారం ఇద్దరూ కలిసి ఓ వీడియో చేసి రిలీజ్ చేశాడు. అందులో ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఎంతో సంతోషంగా కనిపించారు. భార్యాభర్తలుగా విడిపోయినా.. తాము ఒకే కుటుంబమని, ఒకరికొకరం తోడుంటామని ఆమిర్ ఆ వీడియోలో చెప్పాడు.
ఇది విని మీరు బాధపడి ఉండొచ్చు. బాగా అనిపించకపోవచ్చు. షాక్కు గురై ఉండొచ్చు. కానీ మేము ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నామని మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాం. మేమిద్దరం ఒకే కుటుంబం. మా మధ్య ఉన్న సంబంధంలో మార్పు వచ్చింది కానీ.. మేము ఒకరి కోసం ఒకరం ఉంటాము అని ఆమిర్ అన్నాడు. లగాన్ మూవీ సందర్భంగా కిరణ్ రావ్ను కలిసి ఆమిర్.. 2005లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందు 16 ఏళ్ల పాటు అతడు రీనాదత్తాతో కలిసి ఉన్నాడు.