Krishi Thapanda | బెంగళూరులో విషాదం జరిగింది. ఆర్ఆర్ నగర్లో ఉన్న కన్నడ నటి, మోడల్, మాజీ బిగ్‌బాస్ కన్నడ కంటెస్టెంట్ కృషి తపాండ నివాసంలో 33 ఏళ్ల వ్యాపారవేత్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని గిరినగర్‌కు చెందిన వైశాఖ్గా పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల సమాచారం ప్రకారం, గత కొన్ని రోజులుగా వైశాఖ్ ఆర్ఆర్ నగర్‌లోని అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అతను కృషి తపాండ ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్నాడు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లేదా వీడియో సందేశం లభించలేదు.
ఈ ఘటనకు కొద్దిసేపటి ముందు వైశాఖ్ కృషి తపాండను సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కృషి నెలమంగళలో ఉండటంతో కాల్‌కు సమాధానం ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత వైశాఖ్ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సూచిస్తూ సందేశాలు పంపినట్లు సమాచారం. ఆ సందేశాలను చూసిన కృషి వెంటనే వైశాఖ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అపార్ట్‌మెంట్‌కు చేరుకునేలోపే వైశాఖ్ మృతి చెందాడు. ఘటన అనంతరం వైశాఖ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ ఏడాది ప్రారంభంలో వైశాఖ్ చట్టపరమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. వ్యాపారవేత్త అరవింద్ రెడ్డి ఫిర్యాదు మేరకు నమోదైన బెదిరింపు, దోపిడీ కేసులో వైశాఖ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ అరవింద్ రెడ్డికి బెదిరింపు లేఖ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కేసులో అరెస్టయిన వైశాఖ్ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ ఘటనపై కృషి తపాండ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కృషి తపాండ 2016లో ‘అకీర’ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఎరడు కనసు’, ‘కన్నడక్కాగి ఒందన్ను ఒట్టి’ చిత్రాల్లో నటించారు. కిచ్చా సుదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ కన్నడ సీజన్ 5లో పాల్గొన్నారు. ఇటీవల 2025లో ప్రజ్వల్ దేవరాజ్, వేదికా కుమార్, యశా శివకుమార్‌తో కలిసి ‘గణ’ చిత్రంలో కనిపించారు.