Teja sajja | బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు హీరోగా మారాడు తేజ సజ్జా. ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించిన తేజ.. ఆ తర్వాత జాంబిరెడ్డి, అదృష్టం సినిమాలో నటుడిగా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. దీంతో ఈయనకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈయన నటిస్తున్న తాజా చిత్రం హనుమాన్. సూపర్ హీరో ఫాంటసీ నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, హీరోహీరోయిన్ల ఇంట్రడక్షన్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం గురించి ఒక వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కుర్ర హీరో సినిమాకు అదిరిపోయే బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
హనుమాన్ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర హిందీ డబ్బింగ్ రైట్స్‌ను రూ.5కోట్లకు ప్రముఖ దిగ్గజ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో తెరకెక్కిన జాంబి రెడ్డి సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే ఈ సినిమాను 5 కోట్ల మంది వీక్షించారు. దీంతో ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని హనుమాన్ సినిమాకు భారీ మొత్తం ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఇక తెలుగులో డిజిటల్, శాటిలైట్ హక్కులు దాదాపు రూ. 11కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. ఒక యంగ్ హీరోకు ఇంత మొత్తం బిజినెస్ జరుగుతుందంటే విశేషం అనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.