Trade War : అమెరికా, కెనడా (USA, Canada) మధ్య వాణిజ్య యుద్ధం (Trade War) మరింత ముదిరింది. కెనడాను “అత్యంత కఠినమైన, అర్థం లేని భాగస్వామి” అని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అభివర్ణించారు. అమెరికా మార్కెట్ అందుబాటులో లేకపోతే ఆ దేశం ఆర్థికంగా మనుగడ సాగించలేదని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా కెనడా తమను దోచుకుంటోందని వైట్‌హౌస్ (White House) ఆరోపించింది. అమెరికా ఉత్పత్తులపై కెనడా అదనపు ప్రతీకార సుంకాలను ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఈ విధంగా ఘాటుగా స్పందించింది.
తమ ప్రతిపాదనలను కెనడా తిరస్కరించిందని, చర్చలకు బదులుగా ప్రతీకార చర్యలను ఎంచుకుందని వైట్‌హౌస్ ఆరోపించింది. స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌పై సుంకాలు తగ్గించేందుకు తాము ముందుకు వచ్చినా కెనడా మొండిగా వ్యవహరించిందని పేర్కొన్నది. అమెరికా పాల ఉత్పత్తులపై కెనడా 300 శాతం వరకు సుంకాలు విధిస్తోందని, దీనివల్ల తమ ఉత్పత్తులు ఆ దేశ మార్కెట్లోకి ప్రవేశించలేకపోతున్నాయని తెలిపింది. మరోవైపు అమెరికా డిమాండ్లు తమ జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని కెనడా స్పష్టంచేసింది.
అందుకే చర్చల నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. అమెరికా చర్యలకు ప్రతిగా “డాలర్‌కు డాలర్, రేటుకు రేటు” చొప్పున బదులిస్తామని ప్రకటించింది. సెప్టెంబర్ 8 నుంచి 27.6 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా వస్తువులపై 15, 25, 50 శాతం చొప్పున సుంకాలు విధిస్తున్నట్లు కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్-ఫిలిప్ షాంపేన్ తెలిపారు. ఈ వాణిజ్య వివాదంవల్ల నష్టపోయే కార్మికులు, వ్యాపారాలను ఆదుకునేందుకు 7.5 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని కూడా కెనడా ప్రభుత్వం ప్రకటించింది.