AI Engineers : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కు విశేష ఆదరణ లభిస్తుండటంతో లేటెస్ట్ టెక్నాలజీపై పట్టున్న వారికి భారీ డిమాండ్ నెలకొంది. ఏఐ నైపుణ్యాలు కలిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు పెద్దమొత్తంలో వేతనాలు ఆఫర్ చేస్తున్నారు.
ఏఐ నైపుణ్యాలు లేని టెకీలతో పోలిస్తే ఏఐ స్కిల్స్ కలిగిన టెకీలకు 50 శాతం అధికంగా వేతనాలను పలు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. న్యూ టెక్నాలజీ నైపుణ్యాలను అందిపుచ్చుకున్న వారిని భారీ వేతనాలతో ఆకట్టుకునేందుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
ఏఐ, ఏఐయేతర ఇంజనీర్ల మధ్య వేతన వ్యత్యాసాలు దాదాపు 30 శాతం వరకూ ఉన్నాయని చెబుతున్నారు. అమెరికాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏఐ సాప్ట్వేర్ ఇంజనీర్ల వేతనం రూ. 2.4 కోట్ల వరకూ ఉండగా ఏఐయేతర టెకీల వేతనం కేవలం రూ. 80 లక్షలుగా ఉంది.
వేతన వివరాలను పర్యవేక్షించే లెవెల్స్.ఎఫ్‌వైఐ డేటా ప్రకారం టెకీల వార్షికాదాయం పరిశీలిస్తే ఏఐ స్కిల్స్ కలిగిన టెకీలకు భారీ డిమాండ్ నెలకొన్నట్టు వెల్లడైంది. ఏఐ, ఏఐయేతర సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మధ్య ఈ వేతన వ్యత్యాసం 2022లో 30 శాతం నుంచి తాజాగా దాదాపు 50 శాతానికి ఎగబాకినట్టు తెలుస్తోంది.
ఉద్యోగ స్థాయితో సంబంధం లేకుండా AI నైపుణ్యానికి వ్యాపారాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని లెవెల్స్.ఎఫ్‌వైఐ కోసం సమర్పించిన నివేదికలో డేటా సైంటిస్ట్ అలినా కొలెస్నికొవా నొక్కిచెప్పారు. ఈ వేతన వ్యత్యాసం నిర్ధిష్ట కంపెనీల్లో మరింత స్పష్టంగా ఉంది.
ఉదాహరణకు రోబోట్యాక్సీస్లో ప్రత్యేకత కలిగిఉన్న కంపెనీ క్రూయిజ్ తన మధ్యస్ధాయి ఏఐ ఇంజనీర్లకు ఏకంగా 6.8 లక్షల డాలర్ల వేతనం ఆఫర్ చేస్తుండగా ఇది నాన్ ఏఐ టెకీల వేతనం కంటే దాదాపు 1,85,500 డాలర్లు అధికం కావడం గమనార్హం. అత్యున్నత శ్రేణి ఏఐ నైపుణ్యాల కోసం కంపెనీలు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు.
కొన్నిసార్లు స్టార్టప్స్‌ను కొనుగోలు చేసి ప్రత్యర్ధి కంపెనీల్లోని ఏఐ నైపుణ్యాలను చేజిక్కించుకుంటున్నారు. ఏఐలో మెరుగైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను ఆకట్టుకోవడంలో గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి టెక్ దిగ్గజాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఏఐ పరిశోధకులు, ఇంజనీర్లను భారీ వేతనాలు, ఈక్విటీ ప్యాకేజ్‌లు, లక్షలాది డాలర్లతో కూడిన బోసస్ల వంటి ప్రోత్సాహకాలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Read More :