ముంబై, సెప్టెంబర్ 22 : దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు బలపడటం, ఇంధన ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఐటీ, ఆర్థిక, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో సూచీల పతనానికి ఆజ్యంపోశాయి. ఒక దశలో 400 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 329.91 పాయింట్లు కోల్పోయి 74,529.08 వద్ద ముగిసింది.
మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 85.30 పాయింట్లు పతనం చెంది 23,329 పాయింట్ల వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లు ఆశాజనకంగా ఉండటం, క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశీయ సెంటిమెంట్ నిరాశావాదంగా ఉండటం సూచీల పతనానికి ఆజ్యంపోశాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.